హైదరాబాద్: పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్ లోహైడ్రా బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్థరాత్రి.. అపరాత్రి లేకుండా ఇళ్లు కూల్చుతున్నారని మండి పడ్డారు. పదేళ్ల మాజీ సిఎం కెసిఆర్ పాలనలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయని కొనియాడారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని, సచివాలయం, టిహబ్, విహబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని తెలియజేశారు. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని చెప్పారు. గత రెండేళ్లులో నగరంలో కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని అన్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కడితే..ఎందుకు కూల్చలేదు? అని ఎఫ్టిటిఎల్ పరిధిలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు కూల్చేందుకు ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్ టిఎల్ లో ఉందని, తిరుపతి రెడ్డి కోర్టుకు వెళ్లి తెచ్చుకునేందుకు హైడ్రా సమయం ఇచ్చిందని అన్నారు. పేదలు రాజప్రసాదాలు, ప్యాలెస్ లు కట్టకపోయినా వాటిని కూల్చి వేశారని, పెద్దవాళ్లు భవంతులు, ఫామ్ హౌస్ లు నిర్మిస్తే.. వాటిని కూల్చే ధైర్యం లేదని విమర్శించారు. గాజులరామారాంలో అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదని, గాజులరామారంలోనే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు, పోలీసులను పంపారని కెటిఆర్ దుయ్యబట్టారు.