గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే ఏర్పడే ప్రజల ప్రభుత్వంగా వివరించాడు. అనంతరం ప్రముఖ అమెరికా దేశ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారానే నడిచే ప్రభుత్వం అని అద్భుతంగా నిర్వచించాడు. కాలక్రమేణా ఈ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, అనేక దేశాల పాలనా విధానాలకు మార్గదర్శకంగా నిలిచింది. భారతదేశం కూడా తన రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల సంకల్పానికి ప్రతిబింబం, ప్రజల హక్కులకు పరిరక్షణ, ప్రజల శ్రేయస్సుకై నడిచే పటిష్టమైన జవాబుదారీ పాలనా విధానం. రాచరిక వ్యవస్థలను రూపుమాపి, ప్రజలే ప్రభువులు అనే భావంతో ఏర్పడిన ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేసి, వాటిని సక్రమంగా అమలు చేయడానికి పన్నే యుక్తి. ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం అవసరమైన పాలన యుక్తులను పన్నే ప్రజా నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు; వారినే రాజకీయ నాయకులు అంటారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే రాజకీయం అంటే పాలనా యుక్తి. ఆ యుక్తిని అమలు చేసే వారిని రాజకీయ నాయకులని అంటారు. కానీ నేటి పరిస్థితుల్లో రాజకీయం అంటే ఒకటి చెప్పి మరొకటి చేసే కుయుక్తిగా, నమ్మించి మోసం చేసే సాధనంగా మారిపోయింది. ఒకప్పుడు పాలనాదక్షతకు ప్రతీకగా ఉన్న రాజకీయం నేడు కపటానికి ప్రతిరూపంగా మారిపోతోంది. రాజకీయం చేయడం అనేది ఇప్పుడు ఒక మోసపూరితమైన మాటగా మిగిలిపోతోంది. మన కులమని, మన మతమని, మన ప్రాంతమని ప్రజలను ఎక్కడికక్కడ విభజిస్తూ తమ కుయుక్తులను పన్నుతున్నారు నేటి రాజకీయ నాయకులు. దీంతో రాజకీయాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతూ ప్రజాస్వామ్యం పునాదులను కదిలించి వేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో, మానసిక స్థితిలో గణనీయమైన అనైతిక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న కార్యక్రమాన్నీ ఎంతో గొప్పగా చెప్పుకునే నాయకులు, అదే కార్యక్రమాలను వారి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తే, వారిని తీవ్ర పదజాలంతో విమర్శించడం నేటి రాజకీయ సంస్కృతిగా మారిపోయింది.
ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా మరో పార్టీ వ్యతిరేకించడమే రాజకీయమని భావించే పరిస్థితి ఏర్పడింది. ప్రెస్‌మీట్లు పెట్టి నిర్మాణాత్మక చర్చలను జరపకుండా, సద్విమర్శలను చేయకుండా, మంచి సలహాలను సూచించకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలంతో దూషణలు చేసుకుంటూ, ప్రజాభివృద్ధికి ఉపయోగించవలసిన విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. నేటి రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేసే అత్యుత్తమ సేవా రంగాలుగా కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే అవినీతి వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని నడిపే నాయకుల ఆలోచనా ధోరణి ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్య విలువలు క్రమక్రమంగా అంతరించిపోయి, ప్రజా ప్రభుత్వాలలో ‘ప్రజా’ అనే పదం పోయి ప్రభుత్వాలు మాత్రమే మిగులుతాయి. ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కాబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు శాశ్వతమైన అభివృద్ధిని అందించకుండా వారిని ఆకర్షించడానికి ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. సమాజ, దేశ అభివృద్ధి కంటే వారి పార్టీ ప్రయోజనాలే ప్రధానమనేలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం తప్పు అని తెలిసినా తప్పుడు హామీలు ఇస్తూ ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ప్రజలు కూడా తాత్కాలికమైన ప్రయోజనాలకు ఆశపడి అప్రయోజకులను తమ నాయకులుగా ఎన్నుకొని వారి అభివృద్ధిని వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలు మారుతున్నా, పాలనా విధానాలలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సమాజ అభివృద్ధి కంటే వారి పార్టీ అభివృద్ధికే పెద్దపీట వేస్తుంది. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఐదేళ్లకోసారి, ఓటు వేసే ముందు మాత్రమే ఈ రాజకీయ నాయకులకు కనిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యపు అర్థాన్ని అపహాస్యం చేస్తుంది. రాజకీయ నాయకులు చేసే అక్రమాలు, తప్పులను, వారిని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా సమర్థిస్తూ ఉంటారు.
వారు అభిమానించే నాయకుడు తప్పు చేసినప్పుడు అతనిని ఎవరైనా విమర్శిస్తే, ఈ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ నాయకుడిని విమర్శించిన వారిపై విపరీతమైన దుర్భాషలతో పోస్టులు పెడుతున్నారు. విమర్శించిన వారిని కించుపరిచే విధంగా మీమ్స్, మార్పిడి ఫోటోలు అసభ్యంగా తయారు చేసి షేర్ చేస్తున్నారు. ఇది సమాజానికి చేటుచేసే విష సంస్కృతి. నిజమైన అభిమానం అంటే, ఒక నాయకుడిని గుడ్డిగా సమర్ధించడం కాదు. ఆ నాయకుడు చేసే మంచి పనుల నుంచి స్ఫూర్తిని పొందడం, తప్పు జరిగినప్పుడు సద్విమర్శలు చేయడం. కానీ, గుడ్డి అభిమానంతో అసభ్యకరమైన చర్చలు, పోస్టులు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు ఈ అభిమానులు. నేటి రాజకీయ నాయకులు మాయ మాటలతో అభిమానులను రెచ్చగొట్టి వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనా విధానాన్ని నాయకులు మార్చుకోవాలి. లేకపోతే సమాజంలో ఐక్యత దెబ్బతింటుంది. నాయకులు తమ అభిమానులకు సరిగ్గా మార్గనిర్దేశం చేయాలి.
ఎందుకంటే, తప్పు చేసినా కూడా పొగిడే అభిమానులను కలిగి ఉన్న నాయకుడు ఎప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందలేడు. కాబట్టి, నాయకులు తమ అభిమానుల్లో స్ఫూర్తిని రగిలించి, వారు సమాజానికి గొప్పగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. ప్రజాస్వామ్యాన్ని సమాజంలో పటిష్టంగా నిర్మించాలంటే కేవలం చట్టాలను రూపొందించడం మాత్రమే కాక, వాటిని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనే వారి పాత్ర ఆగిపోకూడదు. తమ ఓట్ల ద్వారా నాయకులను ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు, ఆ ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణకై సమన్వయంతో కలిసి పనిచేయాలి. నాయకులు ప్రజలు వారికి కట్టిపెట్టిన అధికారాన్ని ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించాలి.
నాయకులు పెత్తనం చెలాయించే అధికారులుగా కాక, ప్రజాక్షేమం కోరుకునే సేవకులుగా పనిచేయాలి. అభిమానులు వ్యక్తులను కాక, ఆ వ్యక్తులు చేసే గొప్ప కార్యక్రమాలను అభిమానించాలి. తమ అభిమాన నాయకుడిపై విమర్శలు వచ్చినప్పుడు, ఆ విమర్శలలో నిజాన్ని విశ్లేషించి, నిర్మాణాత్మకంగా స్పందించాలి. అంతేగాని, ఒకరు విమర్శించగానే గుడ్డిగా తమ అభిమాన నాయకులను సమర్ధించకూడదు. ప్రజాస్వామ్యంలో విశ్లేషకుల నిర్మాణాత్మక చర్చలు, విశ్లేషణలు, ప్రతిపక్షాల సద్విమర్శలు, పోరాటాలు అన్నీ ముఖ్యమైన అంశాలే. ఇవి ప్రజలకు విషయాలపై అవగాహన కలిగిస్తాయి. ప్రభుత్వాలను పరిపాలించే రాజకీయ నాయకులు, వారిని ఎన్నుకున్న ప్రజలు, నాయకుల చుట్టూ ఉన్న అభిమానగణం, ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్షాలు అందరూ సమష్టిగా, అవగాహనతో చట్టాలను అమలు చేయగలిగితే ప్రజాస్వామ్యపు నిజమైన అర్థం శాశ్వతంగా పరిరక్షించబడుతుంది.
– ననుబోలు రాజశేఖర్, 9885739808