మెక్సికోలోని హెర్మోసిల్లోలో దారుణం చోటు చేసుకుంది. వాల్డో సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో ధృవీకరించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ ప్రమాద ఘటన తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె.. గవర్నర్ అల్ఫోన్సోతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బందిని పంపించాలని.. అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్స్‌ను ఆదేశించినట్లు తెలిపారు.