మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసి స్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు గతంలో తీ సుకున్న నిర్ణయం ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్ చేపడుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) చైర్మన్ రమే ష్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విజిలెన్స్ విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్‌మెయిల్ చేయడమే అని పేర్కొన్నారు. నాలుగు కాలేజీలకు విడుదల చే సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులపైనా, అనర్హులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను విజిలెన్స్ విచారణలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ఫతి ప్రతినిధులు కృష్ణారావు, సునీల్‌కుమార్, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి కలిసి చైర్మన్ రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన తమకు హామీ ఇచ్చినట్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో సోమవారం నుంచి నిరవదిక బంద్ చేపడతామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని.. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు బంద్‌లో పాల్గొంటాయని వెల్లడించారు. తమ నిరసనలో భాగంగా ఈ నెల 6న లక్ష నుంచి లక్ష యాభై వేల మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహిస్తామని,
ఈ నెల 10 లేదా 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తామని చెప్పారు. తమ నిరసనలో భాగంగా మంత్రుల ఇళ్ల ముట్టడితో పాటు నియోజకవర్గాలలో ఎంఎల్‌ఎల ఇండ్లను ముట్టడిస్తామని అన్నారు.అలాగే జిల్లాల్లో కలెక్టరేట్‌ల ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. వివిధ యూనివర్సిటీల పరిధిలో ఈ నెల 3 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను కోరారు. ఈ విషయం ఇప్పటికే ఆయా యూనివర్సిటీల అధికారులకు తెలియజేశామని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుంటే తాము కాలేజీలు నడపలేమని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఫతి వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు బాధ్యత ఎంఎల్‌ఎలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలు పడిపోయాయని గుర్తు చేశారు. కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని కోరారు.