బాత్‌రూమ్ గోడ కూలి బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా, సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సాంబరాజు, మౌనికల కుమారుడు వేల్పుల నవదీప్ (10) ఇటీవల సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతిలో సీటు సాధించాడు. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈనెల 3న హాస్టల్‌లో చేర్పించేందుకు కుమారుడిని తీసుకువెళ్లనున్నారు. శనివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంట్లో ఉన్న నవదీప్ కిరాణా షాప్‌కు వెళ్తుండగా వర్షాలతో నాని ఉన్న బన్న రమేశ్‌కు చెందిన బాత్‌రూమ్ గోడ ప్రమాదవశాత్తు పడింది.
ఈ ప్రమాదంలో బాలుడు కింద పడి పోవడంతో తలకు, భుజానికి బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చి, గోడ కింద పడి ఉన్న కుమారుడిని తీసి ఎంజిఎంకు తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తమ కొడుకు బడికి వెళ్లి ఉంటే బతికి ఉండేవాడని తలుచుకుంటూ తల్లిదండ్రులు రోదించే తీరును అందరినీ కలచివేసింది. నవదీప్ మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తాత వేల్పుల లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.