గద్దర్ కుమార్తెను రేవంత్‌రెడ్డి మోసం చేశారని బిఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వెన్నెలకు రేవంత్ రెడ్డి ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని అడిగారు. సెంటిమెంట్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతారా…? అని ప్రశ్నించారు. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి కెసిఆర్ టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు.తెలంగాణ భవన్‌లో శనివారం కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఇంఛార్జ్ నివేదిత, ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని…కానీ, జూబ్లీహిల్స్ ప్రజలు మోసపోరు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ కోడి కథ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలిసిందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో రేవంత్ రెడ్డి క్యాలిఫ్లవర్ పెడుతున్నారని విమర్శించారు.కంటోన్మెంట్‌కు రేవంత్ రెడ్డి ఇచ్చిన నాలుగు వేల కోట్లు ఎక్కడ…? అని ప్రశ్నించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎలివేటెడ్ కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, బోర్డు మీటింగ్‌కు మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి హాజరు కాలేదని అన్నారు.
ఎస్.ఆర్.డి.పిలో భాగంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. కంటోన్మెంట్ ఎంఎల్‌ఎకు సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో చర్చకు తాము సిద్ధం అని, రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎంఎల్‌ఎను పంపాలని సవాల్ విసిరారు. కంటోన్మెంట్‌లో 6 వేల ఇందిరమ్మ ఇళ్లు ఎక్కడ ఉన్నాయని అడిగారు. రేవంత్ రెడ్డి సల్మాన్ ఖాన్‌తో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.బిఆర్‌ఎస్ కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఇంచార్జ్ నివేదిత మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి భయం రేవంత్ రెడ్డికి పట్టుకుందని విమర్శించారు. అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు ఇవ్వమని సిఎం డైరెక్ట్‌గా చెప్పారని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మాజీ ఎంఎల్‌ఎ సాయన్న అభివృద్ధి చేశారని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తమ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారరు. అలాగే జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, ఆమెపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఓడించాలని కోరారు.