జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్‌ఎస్ రుణం తీర్చుకోవడానికి బిజెపి ప్రాధాన్యత లేని అభ్యర్థిని బరిలోకి దించిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక నుంచి మొదలుకుని ట్రిబుల్ తలాక్ వరకూ బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మద్దతునిచ్చారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎన్డీయే తీసుకునే ప్రతి నిర్ణయంలో కెసిఆర్ పాత్ర ఉందన్నారు. కాబట్టి ఇప్పుడు బిఆర్‌ఎస్ రుణాన్ని బిజెపి తీర్చుకుంటున్నదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నూ బిజెపి ఎనిమిది లోక్‌సభ సీట్లలో విజయం సాధించడానికి బిఆర్‌ఎస్ సహకరించిందన్నారు. బిఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కారణంగానే బిజెపి ప్రాధాన్యం లేని అభ్యర్థిని బరిలోకి దించిందన్నారు.
కాంగ్రెస్ నుంచి ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకోండి కానీ ఓటు మాత్రం బిఆర్‌ఎస్‌కు వేయాలని కెటిఆర్ ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేసినందుకే జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.