కేరళ ఇప్పుడు కడుపేదరికం నుంచి పూర్తి స్థాయిలో విముక్తి పొందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కేరళ అసెంబ్లీలో ఆయన శనివారం అధికార ఎల్‌డిఎఫ్ తరఫున ఈ ప్రకటన వెలువరించారు. దయనీయ పేదరిక పరిస్థితులు రాష్ట్రంలో లేవని, దారిద్య్ర రేఖకు ఎగువన ప్రజలు ఉన్నారని చెప్పారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం స్థానికంగా వ్యవహరించే పిరవి దశలో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం అట్టడుగు స్థాయి ప్రజల స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ , వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇప్పుడు కేరళ నిరుపేదలు లేని రాష్ట్రం అయిందన్నారు. దుర్బర దారిద్య్రం లేని తొలి రాష్ట్రంగా కేరళ ఇప్పుడు నిలిచిందని వెల్లడించారు. రేషన్ కార్డులు, జీవనోపాధికి పలు కార్యక్రమాలు, ఆధార్ కార్డులు, పెన్షన్లు ఇతరత్రా చర్యలను ముమ్మరం చేయడం జరిగింది.
క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాస్తవిక పరిస్థితులను గుర్తిస్తూ తీసుకున్న చర్యల ఫలితంగానే కేరళ పరిస్థితి మారిందన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా సిఎం చేసిన పేదరిక నిర్మూలన ప్రకటనను కాంగ్రెస్ నాయకత్వ యుడిఎఫ్ తప్పుపట్టింది. ఇది మోసపూరితం అని, ఫ్రాడ్ అని విమర్శించింది. సెషన్‌ను బహిష్కరిస్తున్నట్లు యుడిఎఫ్ నేత సతీషన్ తెలిపారు. నినాదాలకు దిగుతూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ జరిపారు. తప్పుడు ప్రకటన మోసపూరితం , సిగ్గుచేటు అని విమర్శించారు. సిఎం విజయన్ స్పందిస్తూ యుడిఎఫ్ వారికి ఎప్పుడూ మోసపూరితంగా వ్యవహరించడమే తెలిసిన కళ. అందుకే వారు ఈ మోసం అనే మాటలకు దిగుతున్నారు. తాను వారికి చెప్పదల్చకున్నది ఒక్కటే , మేం చేయాల్సింది. అమలు కావల్సింది చేశామని ,అందుకే ఈ విజయం సాధించామని, ఇదే ప్రతిపక్ష నేతలకు తమ సమాధానం అని స్పష్టం చేశారు.