పరస్పర ప్రతీకార సుంకాల హెచ్చింపులతో ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా, చైనా అధినేతల మధ్య దక్షిణ కొరియా లోని బుసాన్ వేదికగా భేటీ జరగడం అనూహ్య పరిణామం. ఆరేళ్ల తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను ఒప్పందం కుదుర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్‌లో తాను చైనా పర్యటిస్తానని, ఆ తరువాత జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఉంటుందని ప్రకటించారు. నిన్నమొన్నటివరకు శత్రువులుగా కత్తులు నూరుకున్న అగ్రనేతలు ఇద్దరూ దోస్తీ కావడం మంచి పరిణామమే. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకా తనదారిలోకి సరిగ్గా రావడం లేదని, అందుకని చైనాతో స్నేహం పెంచుకుంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావచ్చన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఈ విషయాలేవీ ప్రస్తావనకు రాకుండా కేవలం వాణిజ్య అంశాలపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే షట్‌డౌన్‌లో నడుస్తోన్న అమెరికా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ట్రంప్ ప్రస్తుత ప్రధాన లక్షంగా కనిపిస్తోంది.
అధిక సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడంతో చైనా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దశలో ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అయితే ట్రంప్ చెప్పే దానికి, చేసే దానికి మధ్య ఉన్న అవాంతరాలను ఎదుర్కోవడానికి ప్రపంచం అలవాటుపడిన తరుణంలో ఆందోళనలకు కొంత విరామం కలిగి ఉండవచ్చు. అన్ని సమస్యలు క్లుప్తంగా పరిష్కరించబడతాయని నమ్మడమంటే ఈసారి ట్రంప్ తన మాటలను చేతలతో నిరూపించడానికి మొగ్గు చూపిస్తుండడమే కావచ్చు. చైనాపై అమెరికా విధించిన సుంకాలు 10 శాతం వరకు తగ్గుతాయని ట్రంప్ ప్రకటించారు. 57 శాతం నుంచి 47 శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనికి బదులుగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఏడాది కాలం వరకు ఆంక్షలను తొలగించింది. దీంతో సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తూ, ప్రపంచ వాణిజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన వాణిజ్యయుద్ధం ముగింపు ప్రారంభమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
అమెరికాతో ఒప్పందానికి అన్ని దేశాలు సన్నద్ధం కావడానికి లేదా వారి ఎగుమతి గమ్యస్థానాలను గుర్తించడానికి అవకాశాలు కలగవచ్చు. గత ఆరు నెలలుగా ట్రంప్ చపలమైన ఇష్టాయిష్టాలు, ఊహాగానాలతో అధిక సుంకాలు, ప్రతీకార సుంకాలతో ఆర్థిక వాణిజ్య లావాదేవీలు ప్రపంచ దేశాల్లో అస్తవ్యస్తమయ్యాయి. చైనా, బ్రెజిల్ తోపాటు భారత్‌కూడా దీనికి బాధితురాలైంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా ఖజానాను నింపుతుండడం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి దోహదం చేస్తోందని భారత్‌పై విచక్షణారహితంగా ట్రంప్ నిందారోపణ చేయడం తీవ్రంగా కొనసాగుతోంది. అందువల్ల భారత్ కూడా అమెరికా నుంచి అత్యధిక సుంకాల బాధితురాలు కావలసి వస్తోంది. అందుకనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలన్న డిమాండ్ ట్రంప్ నుంచి పదేపదే వస్తోంది. ఈ మేరకు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులకు కూడా బ్రేక్ పడినట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.
సింథటిక్ మత్తు పదార్థం ఫెంటానిల్ తయారీకి అవసరమైన రసాయనాల సరఫరాను నివారించాలన్న అమెరికా విజ్ఞప్తిని చైనా అంగీకరించడంతో ఫెంటానిల్ విషయంలో చైనాపై ప్రతీకారంగా విధించిన 20 శాతం సుంకాల్లో 10 శాతం తగ్గిస్తానని ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్, బ్రెజిల్‌తో కూడా త్వరలో వాణిజ్య ఒప్పందాలు సమంజసమైన రీతిలో కుదుర్చుకునేలా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అమెరికాకు దిగుమతి అయ్యే ఏ వస్తువులపైనయినా సరే సుంకాలు అధికంగా విధిస్తే అమెరికాలోని పౌరులు ప్రతివారూ తమ జేబులోంచి ఎక్కువగా చెల్లించుకోవలసి వస్తుందని ట్రంప్ ఇప్పటికైనా గ్రహించారా అన్న చర్చ సాగుతోంది. కెనడాపై టారిఫ్‌ల భారాన్ని రోనాల్డ్ రీగన్ వ్యతిరేకించగా, ఆ అభిప్రాయాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడానికి వీలుగా ట్రంప్ టారిఫ్ తంత్రాలు చాలావరకు ఆగిపోవాల్సి వచ్చినప్పుడు, ప్రపంచ వాణిజ్యంలో కొంత క్రమబద్ధీకరణ జరిగినప్పుడు 2026 నుంచి సజావుగా సాగుతుందని అంచనా వేయడం కష్టం.
రష్యానుంచి కొనుగోళ్లను తగ్గించడాన్ని భారత్ సమర్థిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలన్న తార్కిక ఆలోచతో భారత్ ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను, అమెరికా రైతులను సంతోషపెట్టడానికి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తామని చైనా బలవంతంగా అంగీకరించి ఉండవచ్చు. కానీ ఇదే విషయంలో భారత్ సందిగ్ధంలో పడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక గందరగోళం తలెత్తిన కొన్ని నెలల తరువాత అమెరికాలో పెట్రోలు ధరలు, సూపర్ మార్కెట్లలో కిరాణా సామాన్ల ధరలు బాగా తగ్గించగలిగానని ట్రంప్ తన విజయాలుగా చాటుకుంటున్నప్పటికీ, ట్రంప్ తన తీవ్ర వైఖరి నుంచి వెనక్కు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది మంచిదే అయితే ఊదరగొట్టే చర్యలు, ప్రతీకార సుంకాల విధింపులు ఎన్ని అనుభవించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ప్రపంచ అగ్రరాజ్యాలు రెండూ అర్థం చేసుకున్నాయి. అమెరికాకు చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటు పోరాటానికి కారణమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదం లోకి నెట్టేంత రిస్క్ వారు తీసుకోలేకపోయారు.