శుక్రవారం… ముస్లింలకు పవిత్రమైన రోజు. మంత్రి మండలిలో మైనారిటీ మినిస్టర్ లేని లోటు సరిగ్గా నమాజ్‌కు కొద్దిసేపు ముందు తీరింది. అంతేనా! మరో 10 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండగా, అక్కడి ఓటర్లలో 30 శాతం ప్రాబల్యం గల ముస్లింల దృష్టిని అకస్మాత్తుగా ఆకర్షించింది. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైమింగ్ ముచ్చటేస్తోంది. నిశ్శబ్దంగా ఉండీ ఉండీ ఒక్కసారిగా గుంపగుత్త ఓట్లపై గురిపెట్టారన్నది సమయం, సందర్భం, నేపథ్యం చెప్పకనే చెబుతున్నాయి. తన మంత్రి వర్గం పాక్షిక విస్తరణ ముహూర్తంలోనూ ముస్లింల మనోభావాలను గొప్పగా పాటించారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం. మధ్యలో ఒక శుక్రవారం. తదుపరి శుక్రవారం (నవంబర్ 14, బాలల దినోత్సవం కూడా) ఓట్ల లెక్కింపు. మొత్తానికి శుక్రవారం షుక్రియాగా ఈ ఈవెంట్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లలో లక్షా ఇరవై వేల మంది ముస్లింలే. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ తక్షణ కర్తవ్యం ఏమిటో ఈరోజు నుంచే చూస్తున్నాం! ఎఐసిసి, సిఎం మధ్య సమన్వయం భాసిల్లుతోందని మంత్రివర్గం స్వల్ప విస్తరణ రుజువు చేసింది.
మూడు ఖాళీల భర్తీకోసం వేచిచూసి విసిగిపోతున్నారు ఆశావహులు. ఎందుకు నాన్చుతూ రెండేళ్ళు వెళ్ళదీశారో వారికి ఎరుకలోకి వచ్చినట్టయింది. మనకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆంధ్రాలో ప్రచారానికి బయల్దేరారు. తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిందని తన చేతి గడియారం వంక చూసి, నిర్ధారించుకొన్నారు. హైదరాబాద్ పోవాలంటే మనకు వీసా కావాలా? అంటూ కోస్తాంధ్ర రాయలసీమ ఓట్లను ఒక్క వాక్యంతో బుట్టలో వేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అలానే సైలెంట్ వ్యూహాన్ని అమలు చేసే దాకా లోకానికి తెలియలేదు. ఇప్పటికిప్పుడు ఈ పొలిటికల్ డెవలప్‌మెంట్ ఎవరి ఊహకూ అందలేదు. కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్‌లో విజయంపై గురి తప్పవద్దనే సిఎం సైలెంటుగా తన పని తాను చేసుకుపోతున్నారని విదితమైంది. తన రాజకీయ నిర్ణయాలను అమల్లోకి తెచ్చేదాకా రహస్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. పోలింగ్‌కు 10 రోజుల ముందు తన మంత్రి మండలిలోకి అజారుద్దీన్‌ను తీసుకోవడం ఇందుకు కొనసాగింపు.
గెలుపోటములను తీక్షణంగా డిసైడ్ చేసే స్థాయిలో మైనారిటీల ఓట్లు జూబ్లీహిల్స్‌లో ఉన్నాయి. గుంభనంగా ఉంటూ ఉంటూ ఏకంగా అజారుద్దీన్‌ను కేబినెట్ లోకి సమయానుకూలంగా చేర్చుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. ఎమ్మెల్సీ పదవి అజారుద్దీన్‌కు ఆల్రెడీ ప్రతిపాదించారు. తాను ఇక 6 నెలలలోపు ఏదో ఒక చట్టసభలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్‌కు బెర్త్ కోసం ఎఐసిసి ఆమోదం ఉండకుండా ఉండదు. అంటే.. హైకమాండ్, రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ వ్యూహాల్లో సమన్వయంతోనే ఉన్నట్లు వేరే చెప్పక్కర్లేదు. మూడు ఖాళీలకుగాను అజారుద్దీన్‌కు స్థానంతో మంత్రి మండలిలో మైనారిటీలు లేని లోటు తీర్చడం, జూబ్లీహిల్స్‌లో వారి మద్దతు కూడగట్టేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా, సమయస్పూర్తితో నిశ్చయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యాలు మనకు కనిపించిన 24 గంటల్లోనే మంత్రి మండలిలో మైనారిటీకి స్థానం అనే సంచలన సమాచారం దేనికదే అయినప్పటికీ… బిజెపి, బిఆర్‌ఎస్ ఎత్తుగడలకు ఏమాత్రం తక్కువ కాకుండా… అన్ని మతాలు, వర్గాల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మామూలుగా గురి పెట్టలేదని మాత్రం తెలుస్తున్నది. నవంబర్ 9 వరకూ స్వయంగా జూబ్లీహిల్స్ ప్రచారంలో లెగ్ వర్క్, ఫీల్ వర్క్ మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట కొత్త మంత్రి అజారుద్దీన్ ఉండనుండడం రాజకీయ తెరపై సరికొత్త సన్నివేశం. జూబ్లీహిల్స్ లోనూ తన ఎత్తుగడలు క్లిక్ అయితే, సాధారణ ఎన్నికలకు ఏడాది లేదా రెండేళ్ల ముందు ఇలానే ఎవరికీ అంతుబట్టని అస్త్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగిస్తారు.
– ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384