మనతెలంగాణ/హైదరాబాద్:ఈపిటిఆర్‌ఐ (ఎన్వీరాన్‌మెంటల్ ప్రొటక్షన్ ట్రైనిం గ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లో నిధుల స్వా హా జరిగింది. కేంద్ర, రాష్ట్రాలు కేటాయించిన నిధులకు సంబంధించి గోల్‌మాల్ జ రిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కేంద్రం ఈపిటిఆర్‌ఐకు సుమారుగా రూ.17 కోట్లను (వేర్వేరు) అవసరాల ని మిత్తం విడుదల చేయగా ఆ నిధుల్లో సు మారుగా రూ.12 కోట్లను ఈ శాఖ అధికారులు స్వాహా చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనిపై కేంద్రం ఈపిటిఆర్‌ఐకు మెమో జారీ చేసిందని, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించినట్టుగా తెలిసిం ది. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ కో సం రాష్ట్రప్రభుత్వం కేటాయించే నిధుల్లో సైతం భారీగా అవకతవకలు జరిగాయని ఆ శాఖ ఉద్యోగులే ఆరోపణలు చేస్తుండ డం విశేషం. ప్రస్తుతం ఈపిటిఆర్‌ఐ సం స్థకు సంబంధించి నిధుల స్వాహాలో ఓ రిటైర్డ్ అధికారి హస్తం ఉందని,
ఆయన రిటైర్ అయినా ఇంకా అక్కడే పదవిలో కొ నసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్ అయిన అధికారిని మళ్లీ అదే పదవిలో కొనసాగించకపోతే నిధుల స్వాహా విషయం బయటపడుతుందన్న ఉద్ధేశ్యంతోనే ఆయన్ను అ క్కడ కొనసాగిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగు లు పేర్కొంటుండడం గమనార్హం. దీంతోపాటు ఈ విషయం బయటకు రాకుండా ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు వ్యవహారాన్ని చక్కబెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించి 7 సంవత్సరాలైనా ఇంతవరకు దాని గురించి ఈపిటిఆర్‌ఐ ఎలాంటి నివేదికను అందించకపోవడంతో ఈ నిధుల స్వాహా విషయం బయటపడిందని తెలుస్తోంది.
7 సంవత్సరాలైనా మహబూబ్‌నగర్‌లో పరిశోధనలు జరగలేదు…?
వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడానికి ఈపిటిఆర్‌ఐకు రూ.7 కోట్లను కేంద్రం కేటాయించింది. దీంతోపాటు జిఐజెడ్ నుంచి సుమారుగా రూ.10 కోట్ల నిధులను ఈపిటిఆర్‌ఐ కేటాయించారు. అయితే, వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడంతో పాటు పర్యావరణ ప్రజలకు అవగాహన కల్పించడం, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం తదితర వాటి కోసం ఈ నిధులను కేటాయించింది. వాతావరణంలో వచ్చే మార్పుల గురించి పరిశోధించడానికి మహబూబ్‌నగర్ జిల్లాను కేంద్రం ఎంపిక చేయడంతో పాటు అక్కడ జరిగే వాతావరణ మార్పులు, దానికి కారణాలను తెలియచేయాలని కేంద్రం నిధుల విడుదల సందర్భంగా ఈపిటిఆర్‌ఐకు సూచించింది. ఇది జరిగి 7 సంవత్సరాలైనా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పరిశోధనలు జరగకపోగా కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను కొందరు అధికారులు స్వాహా చేశారని, దొంగ బిల్లులను పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు జిఐజెడ్ నుంచి వచ్చిన రూ.10 కోట్లను వాతావరణ మార్పుల గురించి తెలుసుకోకుండా, అసలు పరిశోధనలు చేయకుండా ఆ నిధులను కూడా దిగమింగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుతో కేంద్రం రంగంలోకి….
వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయని ఆ నిధుల గురించి ఇప్పటికే పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ హయాంలో భారీగా అవినీతి జరిగిందని అయినా దానిపై విచారణ జరగడం లేదని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవడంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీనమేషాలు లెక్కిస్తున్నారని అందులో భాగంగా కొందరు ఆ శాఖకు చెందిన ఉద్యోగులు అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈపిటిఆర్‌ఐ, రాష్ట్ర ప్రభుత్వానికి మెమో జారీ చేసిందని తెలిసింది. ఈ నిధుల అవకతవకలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరినట్టుగా సమాచారం.
చీఫ్ సైంటిస్ట్, డైరెక్టర్ పోస్టులు ఖాళీ
మొత్తం ఈపిటిఆర్‌ఐలో 11 విభాగాలుండగా వాటికి నలుగురు హెడ్‌లు మాత్రమే ఉన్నారు. మిగతా విభాగాలను ఇన్‌చార్జీలతో నడిపిస్తున్నారు. దీంతోపాటు ఈపిటిఆర్‌ఐలో చీఫ్ సైంటిస్ట్ పోస్టు, డైరెక్టర్ పోస్టులు, 8 మంది సైంటిస్ట్, 20 మంది ఎన్వీరాన్‌మెంట్ ఇంజనీర్లతో పాటు సీనియర్ సైంటిస్ట్‌కు సంబంధించి 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరం క్రితం ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయకపోవడం గమనార్హం. ఇలా పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న వారికే అదనపు బాధ్యతలు అప్పగించి నిధులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులకు పదోన్నతులు రాకుండా రిటైర్డ్ అయిన అధికారులతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం.
1990 సంవత్సరంలో ఈపిటిఆర్‌ఐ సంస్థ ఏర్పాటు
1990 సంవత్సరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పిసిబి) నుంచి కొంతభాగాన్ని వేరుచేసి ఈపిటిఆర్‌ఐ సంస్థను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఏర్పాటు కోసం గచ్చిబౌలిలోని 19 ఎకరాల్లో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. వివిధ పరిశ్రమలు తమ సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ దరఖాస్తులను ప్రభుత్వం ఈపిటిఆర్‌ఐకు పంపిస్తుంది. ఆ దరఖాస్తుల ఆధారంగా ఆయా పరిశ్రమలు ఏర్పాటు చేసే చోట కాలుష్యానికి సంబంధించిన పరిశోధన చేయడంతో పాటు వాటర్, గాలి, మట్టి నాణ్యతల గురించి ప్రభుత్వానికి ఈపిటిఆర్‌ఐ అధికారులు నివేదిక అందచేస్తారు. దీంతోపాటు రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన పరిశోధనలను సైతం ఈ సంస్థకే అప్పగిస్తారు. ఎప్పటికప్పుడు గాలి, వాటర్, మట్టి నాణ్యతలను శాటిలైట్ ఆధారంగా పరీక్షలు చేసి ఈపిటిఆర్‌ఐ ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. వీటితో పాటు కాలుష్యరహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగంపై ప్రభావం, ఉష్ణోగ్రతలు పెంచే కార్భన్ డై అక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్‌ల విడుదల తదితర వాటి గురించి ఈ సంస్థ ఎప్పటికప్పుడు పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ సైంటిస్ట్‌లు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో కాలుష్యానికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతోంది.
ఫిబ్రవరిలో రూ.2 కోట్లు విడుదల
ప్రస్తుతం ఈపిటిఆర్‌ఐ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. పరికరాలు కూడా పనికిరాకుండా పోయాయి. ఇక్కడ ల్యాబ్‌లో పరిశోధనలు జరపాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై ప్రభుత్వానికి ఆ సంస్థ ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో మంత్రి కొండా సురేఖ సిఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూ.2 కోట్లను విడుదల చేయించారు.