కదంతొక్కిన జెమీమా, హర్మన్
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా
నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ చిరస్మరణీయ ఆటతో ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా ఉంచిన క్లిష్టమైన 339 పరుగుల లక్ష్యాన్ని హర్మన్‌ప్రీత్ సేన అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలో లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ 5 బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి కిమ్ గార్థ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరును ముందుకు నడిపించింది. ఇద్దరు ధాటిగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కానీ 24 బంతుల్లో రెండు ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేసిన మంధానను కిమ్ గ్రాథ్ వెనక్కి పంపింది. దీంతో భారత్ 59 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
జెమీమా, హర్మన్ అద్భుత పోరాటం..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగారు. వీరికి ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు జెమీమా అటు హర్మన్ తమ మార్క్ షాట్లతో చెలరేగి పోయారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. వీరిద్దరూ కుదురు కోవడంతో భారత్ లక్షం దిశగా సాగింది. ఆరంభంలో జెమీమా దూకుడుగా ఆడింది. హర్మన్ సమన్వయంతో ఆడుతూ జెమీమాకు అండగా నిలిచింది. ఇదే సమయంలో ఇద్దరు అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జోరును మరింత పెంచారు.
హర్మన్, జెమీమా చారిత్రక ఇన్నింగ్స్‌తో భారత్‌ను పటిష్ఠస్థితికి చేర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించారు. వీరిని ఔట్ చేసేందుకు కంగారూ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేసిపెవిలియన్ చేరింది. అప్పటికే జెమీమాతో కలిసి 156 బంతుల్లోనే మూడో వికెట్‌కు 167 పరుగులు జోడించింది. హర్మన్ ఔట్ అయినా జెమీమా తన పోరాటాన్ని కొనసాగించింది. ఆమెకు దీప్తి శర్మ, రిచా ఘోష్‌లు అండగా నిలిచారు. ధాటిగా ఆడినదీప్తి 17 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. చెలరేగి ఆడిన రిచా 16 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్లతో 26 పరుగులు చేసింది. అమన్‌జోత్ కౌర్ 8 బంతుల్లో రెండు ఫోర్లతో అజేయంగా 15 పరుగులు సాధించింది. ఇక చారిత్రక బ్యాటింగ్‌ను ప్రదర్శించిన జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. చివరి వరకు క్రీజులో నిలిచిన జెమీమా టీమిండియాకు ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది.
లిచ్‌ఫీల్డ్ శతకం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఓపెనర్ ఫోయెబ్ లిచ్‌ఫీల్డ్, ఎలిసె పెర్రీ ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. లిచ్‌ఫీల్డ్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. చెలరేగి ఆడిన లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లోనే 17 ఫోర్లు, 3 సిక్సర్లతో 119 పరుగులు సాధించింది. పెర్రీ 88 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 77 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన అష్లే గార్డ్‌నర్ 46 బంతుల్లోనే 4 సిక్స్‌లు, మరో నాలుగు ఫోర్లతో 63 పరుగులు చేసింది. కీలక సమయంలో భారత బౌలర్లు విజృంభించడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 338 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.