మెల్‌బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలి టి20 వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఇరు జట్లకు రెండో టి20 కీలకంగా మారింది. ఇందులో గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియాలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి. పర్యాటక టీమిండియా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే అభిషేక్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి వైస్ కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇద్దరు వర్షం వల్ల ఆట నిలిపి వేసే సమయానికి క్రీజులో నిలిచారు. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గిల్, సూర్యకుమార్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరెగితే టీమిండియా భారీ స్కోరు ఖాయం. అభిషేక్ శర్మ కూడా మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆడాల్సి ఉంది. ఇక సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్ వంటి విధ్వంసక బ్యాటర్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు విజృంభించిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు కష్టాలు ఖాయమని చెప్పాలి.
అందరి కళ్లు శాంసన్‌పైనే..
ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సంజూ శాంసన్‌పైనే నిలిచాయి. జట్టులో స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలంటే సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి శాంసన్‌కు నెలకొంది. నిలకడలేమీ అతనికి ప్రతికూలంగా తయారైంది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరోదాంట్లో విఫలం కావడం అలవాటుగా మార్చుకున్నాడు. దీని నుంచి బయట పడితేనే శాంసన్ కెరీర్ గాడిలో పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన మ్యాచ్‌లు శాంసన్‌కు పరీక్షలాంటివేనని చెప్పక తప్పదు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. కొంత కాలంగా టి20 ఫార్మాట్‌లో తిలక్ అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లోనూ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో భారత్‌కు సంచలన విజయం సాధించి పెట్టాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షర్, హర్షిత్, అర్ష్‌దీప్, బుమ్రా తదితరులతో భారత బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. వన్డే సిరీస్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ఈసారి కూడా జట్టులో ఉన్నారు. ఇది కూడా కంగారూలకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. వన్డే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా టి20లోకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మిఛెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిఛెల్ ఓవెన్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, హాజిల్‌వుడ్, సీన్ అబాట్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కూడా గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు.