అడవులలోని నక్సలైట్లు విడతలు విడతలుగా మైదాన ప్రాంతంలోకి రావటం మొదలైంది. ఆ విధంగా ఇప్పటికే వచ్చిన వివిధ స్థాయిల నాయకులు, దళ సభ్యులు కొన్ని వందల మంది ఉన్నారు. అడవులలో ఇంకా మిగిలిన వారి సంఖ్య ఎంతైనదీ నిర్దిష్టంగా తెలియదు. ఇదంతా మధ్య భారత ప్రాంతపు విషయం. ఇది కాకుండా తూర్పు రాష్ట్రాలకు వెళ్లే కొద్దీ పరిస్థితులు ఏమిటన్న వార్తలు లేవు. దేశం లో నక్సలైట్లను లేదా నక్సలిజాన్ని 2026 మార్చి చివరి నాటికి పూర్తిగా తుడిచి పెట్టగలమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గడువుకు ఇంకా సరిగా అయిదు నెలల గడువుంది. ఆ ప్రకారం ఆయన ప్రకటన నెరవేరుతుందా లేదా అనేది అట్లుంచి, ఈలోగా నక్సలైట్లు ఏమి చేయవచ్చునన్నది ఒక ప్రశ్న అవుతున్నది. ఇదే పద్ధతిలో మరింతమంది బయటకు రాచ్చునా? అందరూ రాగలరా? కొందరు వచ్చి కొందరు మిగులుతారా? అనే విషయాల గురించి వేచి చూడవలసిందే గాని, ముందుగా ఎవరూ చెప్పలేరు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విప్లవోద్యమాల దశలను గమనించినపుడు ఇది అర్థమవుతుంది. మరొక కీలకమైన ప్రశ్న నక్సలైట్లును అంతం చేసినా ఆ భావజాలం పోతుందా అన్నది.
ఆ విషయం అట్లుంచితే, ఇక్కడ ప్రస్తుతం బయటకు వస్తున్న వారి సంఖ్య మొత్తంగా కలిపి పెద్దదే. వారి భవిష్యత్తు ప్రణాళిక ఏమి కావచ్చును? బయటకు రావటం లోగడ కూడా జరిగింది. కాని ఒకటీ అరగా. అందువల్ల వారేమి చేయవచ్చుననే ప్రశ్న రాలేదు. తమ వ్యక్తిగత స్థాయిలోనో, కుటుంబపరంగానో తప్ప. ఎవరి పద్ధతిలో వారు స్థిరపడిపోయారు. బయట చట్టబద్ధంగా పని చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలలో చేరిన వారు ఉన్నారు. కొందరు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వంటి పార్టీలలో చేరారు. బిజెపి గురించి తెలియదు. ఈసారి సంఖ్య వందలలో ఉండటం, కొందరు ముఖ్యులు కూడా కావటం వల్ల ఈ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. మీరు కూడా ఇంతకు ముందటి వారి వలెనే వ్యవహరించవచ్చునా? లేక అందుకు భిన్నంగా ఏమైనా చేయవచ్చునా? పౌరహక్కుల సంఘం బాధ్యడొకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాళ్లు బయటకు వస్తున్నారు గాని ఏం చేసేదీ చెప్పటం లేదన్నారు. ఆ మాటను ఆయన వారిని సవాలు చేయటం, వారి ‘నిజ స్వరూప’మని తాను భావించే దానిని ‘బహిరంగ’ పరచటం అనే ధోరణిలో అన్నట్లు అర్థమవుతున్నది. తమ దృక్కోణం నుంచి అది సరైన ధోరణే కావచ్చు. కాని యథాతథంగా చూసినపుడు, వారు అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. తక్షణం చేయదలచిందేమిటో నిర్ణయించుకుని ఉంటారు. భవిష్యత్ కార్యక్రమం అనేది సీరియస్‌గా జరగవలసిన చర్చ. అడవులలో ఎక్కడైక్కడనో ఉండినవారు ఒక చోటికి చేరి, ఈ ప్రశ్నపై రోజుల తరబడి చర్చించే అవకాశం వారికి ఉంటుందనుకోవటం అవాస్తవికం. ఇదే మాటను సూక్ష్మమైన రూపంలో ఆ నాయకులూ చెప్పారు. ఇప్పుడే గదా బయటకు వస్తున్నాము, ఏమి చేయాలో అందరం కలిసి మాట్లాడుకుంటాము అన్నారు వారు. ఏమి మాట్లాడి, ఏమి చేయవచ్చునన్నది మనం వేచి చూడవలసిన విషయం.
ఇన్నిన్ని మాటలు చెప్పుకుని కూడా చివరకు, బయటకు వచ్చే వారి ప్రణాళిక ఏమిటని చర్చించటం ఆశ్చర్యంగా తోచవచ్చు. అవును, కొన్ని కారణాలవల్ల ఇది చర్చించదగినదే. ఇందులోని ఉద్దేశం మాత్రం పౌరహక్కుల బాధ్యుని వంటిది కాదు. కేవలం కొన్ని విషయాలను అర్థం చేసుకోవటమే. పైన అనుకున్నట్లు, గతంలో వలెగాక ఈసారి పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. వారు చెప్తున్నది మౌలికంగా తమ సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదని, ప్రజల కోసం వారి మధ్య ఉండి పని చేస్తూనే ఉంటామని. తమ పోరాట రూపం మాత్రమే మారుతున్నదని, ప్రభుత్వ బలగాలను ఎదుర్కొనగల శక్తి తమ పార్టీకి లోపించిన స్థితి వల్లనే ఉద్యమాన్ని విరమించాలా, ఆయుధాలు వదలాలా అనే చర్చకు కొంతకాలం క్రితమే ఆరంభం జరిగింది తప్ప, యథాతథంగా అంతకు ముందు అటువంటి చర్చ ఏమీ లేదని. ఇతరత్రా కూడా పార్టీలో, ఉద్యమంలో గతం నుంచి ఉండిన లోపాల కారణంగానే పరిస్థితి ఇంత వరకు పరిణమించిందని. మాటలు సరిగా ఇవే కాకపోవచ్చుగాని, భావం మాత్రం ఇదే.
ఇటువంటి పరిస్థితుల మధ్య అంతిమంగా వీరు ఇక ముందు, తమ సిద్ధాంతాల ప్రకారం, మైదాన రాజకీయ, క్షేత్రంలో సామాజిక క్షేత్రంలో ఏమి చేయగలరనుకోవాలి? ఎందుకోసం, ఎటువంటి అవకాశాలు ఉండవచ్ఛు? అటువంటి ప్రశ్నలపై ఇది ఒక స్థూలమైన చర్చ మాత్రమే. బయటకు వచ్చిన విప్లవకారులు తమంతట తాము ఏదైనా చేయదలిస్తే ముందుగా తోచేది స్వయంగా ఒక పార్టీ ఏర్పాటు చేయటం. ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థలోకి ప్రవేశించినందున, తమ సిద్ధాంతాలను మేళవిస్తూ అందుకు అనుగుణమైన పార్టీ మేనిఫెస్టో తయారీ. పార్టీ యంత్రాంగం. తెలంగాణ అంతటా సంస్థ విస్తరణ, ఎన్నికలలో పోటీలు. ఈ మొత్తం అన్నింటిలోనూ, తాము అంటున్న తమ సైద్ధాంతిక విశ్వాసాల ప్రతిఫలన. తమ మేనిఫెస్టో గాని, ఆచరణ గాని ఇపుడున్న అన్ని రకాల పార్టీలకు కొట్టవచ్చినంత భిన్నంగా ఉంటేనే ప్రజల దృష్టిని ఆకర్షించగలదు. సదరు ఆకర్షణ కొనసాగేది ఏ విధంగా అన్నది వేరే ప్రశ్న.
పార్టీ పెట్టడమే నిర్ణయం అయిన పక్షంలో ఇంతకూ తమ పార్టీలో చేరగల వారెవరు? అడవిలోని దళ సభ్యులలో అధికులు అక్కడి ఆదివాసులే అయినందున తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడే అవకాశమే ఎక్కువ. మైదాన ప్రాంతాలలోని పేదలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనారిటీలు, యువకుల ఆలోచనలు, ఆకాంక్షలు ఒకప్పటివలె వామపక్ష భావజాలానికి సన్నిహితమైన రీతిలో లేవు. వారంతా వివిధ మధ్యేమార్గ పార్టీలు, అవి తమ అధికారం ద్వారా సమకూర్చగలవనుకునే అవకాశాలు, నిజమైన ఉద్యమాలంటూ అవసరం లేని పద్ధతులు, సంక్షేమ పథకాల సౌలభ్యాల మార్గంలోకి మళ్లిపోయారు. అటు నుంచి వెనుదిరగటం ఎంత మాత్రం తేలిక కాని దశ వచ్చి వేసింది. ఆ పరిస్థితుల మధ్య ఈ వర్గాల ప్రజలకు ఇపుడున్న సిపిఐ, సిపిఎం పట్లనే నమ్మకం పోయి వాటిలో చేరటం లేదు. ఇంకా చెప్పాలంటే విప్లవ పార్టీలలో చేరటమూ తగ్గిపోయింది. అటువంటి వాతావరణంలో కొత్తగా వచ్చే వామపక్ష పార్టీలోకి చేరికలు తేలిక కాదు. అంతేకాదు. పైన పేర్కొన్న సామాజిక వర్గాలకు చెందిన వారే నాయకులుగా ఎదిగి వస్తూ తమ సెక్షనల్ అజెండాలను ముందుకు తీసుకుపో జూస్తున్నారు. ఇవి ఏవీ కొత్త పార్టీకి అనుకూలించేవి కావు.
పార్టీల నిర్వహణ విపరీతమైన ఖర్చుతో కూడుకున్నదిగా మారటం మరొక సమస్య. ఆ స్థాయిలో నిధులు సమకూరటం ఒక కొత్త వామపక్షానికి అసాధ్యం. నిధుల సమస్య గురించి ఇప్పటికే గల వామపక్షాలు కూడా మాట్లాడుతుంటాయి. డబ్బు కూడా ఒక ఆధారమనుకుంటే అవేమి వామపక్షాలనే ప్రశ్న రావచ్చు. వివిధ పరిస్థితుల వల్ల అదొక వాస్తవంగా మారిన సంగతి నిజం. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకోగలమనటం శుష్క ఆదర్శవాదమవుతుంది. మన రాజకీయాలు, ప్రజా స్వామ్యం కూడా పేట్రనైజేషన్ (పోషకులు పోషితులు) స్థితిలోకి మారిపోయాయి. ఉన్న కమ్యూనిస్టులే పెద్ద పార్టీల ఎదుట పోషితులుగా నిలుస్తున్నారు. ఇక ప్రజల మాట చెప్పనక్కర లేదు. చివరగా చెప్పాలంటే, సమాజంలో ఆదర్శవాదం గణనీయంగా తగ్గిపోయి వస్తువాదం, వినిమయవాదం, వ్యక్తివాదం పెరుగుతున్నాయి. వీటి ప్రభావాలు కుటుంబ సంబంధాలపైన సైతం పడుతున్నాయి. ఈ విధమైన పరిణామాలు అన్నీ కూడా వామపక్ష రాజకీయాలకు అనుకూలమైనవి కావు.
మరొక పద్ధతి ఒక పార్టీ అంటూ ప్రారంభించి, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి ఆ విధంగా ఉమ్మడి శక్తితో సమాజంలో ఒక వాతావణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించటం. ఇతర వామపక్షాలలో కొందరికి ఇటువంటి ఆలోచనలు ఉన్నట్లున్నాయి. సూత్ర రీత్యా ఇది మంచి ఆలోచనే కావచ్చు. కాని అందులోనూ సమస్యలుంటాయి. ఆ రెండు పార్టీలకు తమలోతమకే కుదరటం లేదు. కారణాలు అనేకం. ఆ రెండింటి మధ్య మూడవ పార్టీకి చోటు అనుమానమే. ఈ మూడవది తమకు పోటీదారు అనుకునే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే వారికి అసలు వామపక్ష స్పృహ, లక్షాలు నిలిచిలేనపుడు, ఇతరులను కలుపుకొని కమ్యూనిస్టు అజెండాను ముందుకు తీసుకుపోయే ఉద్దేశం ఎట్లా కలుగుతుంది? ఈ పరిస్థితులను బట్టి మిగిలేది ఎవరితో వీలైతే వారితో పొత్తు కుదురుకోవటం, ఇక కాదంటే, లోగడ కొందరు మాజీ విప్లవ కారులు చేసినట్లు ఎవరికి తోచిన పార్టీలో వారు చేరటం. అంతటితో సమాధానపడటం. బయటకు వస్తున్న వారు అందుకు చెప్తున్న కారణాలలో ఒకటి ఆరోగ్య సమస్యలు. పెద్ద నాయకులంతా వయసు మీరిన వారే. ఈ రెండు అంశాలు ఉన్నపుడు వారు కొత్త పార్టీ స్థాపన, అందుకోసం పని చేయట మనే నిరంతర శారీరక, మేధోశ్రమను తీసుకోగలరా? బయటకు వచ్చినా పోలీసుల నిఘా వెన్నాడుతూనే ఉంటుంది గనుక ఆ చికాకులను తట్టుకోగలరా? వారికి ఇప్పటికీ తమ సిద్ధాంతంపట్ల అదే కట్టుబాటు నిలిచి ఉన్నా తేలిక కాదు. ఈ చర్చ అంతటి ఉద్దేశం ఒక తఫాను అనంతర పరిస్థితిలోని ఒక కోణాన్ని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నమే.
టంకశాల అశోక్