వర్తమాన రాజకీయాలు గత చరిత్ర చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. గతం లేనిదే వర్తమానం నడవదని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏముంటుంది? గొప్ప వ్యక్తులు ఏ రాజకీయ పక్షానికి చెందిన వారైనప్పటికీ, వారిని గౌరవించడం మన కనీస ధర్మం. ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దండులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులుగా భావించడం విశేషం. ఇది ఆ వ్యక్తుల విశిష్టతను చాటి చెబుతున్నది. మరణించిన మహా నాయకులను స్మరిస్తూనే వారి చరిత్రను మాత్రం జాతికి చెందిన మహోన్నత సంపదగా భావించలేకపోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరా గాంధీ, సర్దార్ పటేల్‌లు భారత దేశానికి అందించిన సేవలు నిరుపమానం. స్వర్గీయ ఇందిరా గాంధీ దేశానికి మహిళా ప్రధానమంత్రి గా పని చేసి, విశేష ఖ్యాతినార్జించారు. దేశం గర్వించదగిన ఎంతోమంది భరత భూమిపై జన్మించారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచి, చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆయా రంగాల్లో కనబరిచే ప్రతిభతో కూడిన విశేషమైన కృషి, పట్టుదల మాత్రమే పేరు ప్రఖ్యాతులకు సంపాదించి పెడుతుంది. భారతదేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్రదాయాల ముసుగులో కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు దూరంగా బతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తమదైన శైలిని ప్రదర్శించి ఎన్నో అడ్డంకులను అధిగమించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికరంగా ల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలుచెరగులా విస్తరింపచేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరా గాంధీ స్థానం ప్రత్యేకమైనది.
తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరా గాంధీ రాజకీయ ప్రవేశానికి కారణం కావచ్చునేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి. పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసనార్హం. నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. అసాధారణ ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన కృషితో, అతిరథ, మహారథులను నిలువరించి, భారత రాజకీయ యవనికపై కీలక పాత్ర పోషించి, నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారత దేశానికి ప్రధానిగా పని చేసి, దేశానికి మూడో ప్రధానిగా, మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, ధైర్యసాహసాలకు మారు పేరుగా నిలిచి, జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. అలహాబాద్‌లో పుట్టి, హస్తినకు ఏలికై, చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారత దేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి, దేశ సమైక్యతకు పాటుబడి, ఒకానొక సమయంలో ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా జనహృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ధీర వనిత ‘ఇందిరా గాంధీ’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టిగరిపించి, తన శక్తిసామర్థ్యాలతో, ధైర్యసాహసాలతో భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీనే వరించింది. ఇందిర మంత్రి వర్గంలో మొరార్జీ దేశాయ్ ఉపప్రధానిగా పని చేసారు.
కేవలం ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతుల మన్ననలు పొందడమే కాకుండా, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, దేశఐక్యతకు అహరహం శ్రమించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన పోషించిన పాత్ర అమోఘం. పటేల్ చూపిన తెగువ వలన భారతదేశం సమైక్యంగా నిలబడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో 565 సంస్థానాలుండగా హైదరాబాద్, జునాగఢ్, కశ్మీర్లు మినహా మిగిలినవి ఇండియన్ యూనియన్‌లో విలీనం కాబడ్డాయి. నైజాం నవాబు అనుమానాస్పద వైఖరి, రజాకార్ల దుశ్చర్యల వల్ల హైదరాబాద్ పాకిస్తాన్ వశమౌతుందని శంకించి పటేల్ సైనిక చర్య చేపట్టాడు. స్వల్ఫకాలం మాత్రమే పదవిలో ఉన్నా, భారతదేశ సమైక్యతకు ఆయన చేసిన కృషి అమోఘం. సర్దార్ పటేల్ జాతీయ వాదానికి, దేశభక్తికి, దేశఐక్యతకు చేసిన కృషికి గుర్తింపుగా ఆ ఉక్కు మనిషి జన్మదినోత్సవమైన అక్టోబర్ 31 వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవం(రాష్ట్రీయ ఎక్తా దివస్)గా భారత ప్రభుత్వం ప్రకటించింది. మరణానంతరం కేంద్ర ప్రభుత్వం సర్దార్‌ను భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఇందిరాగాంధీ, పటేల్ లాంటి సమర్థులకు జన్మనిచ్చిన భారత ధాత్రి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడి శాశ్వతంగా వెలుగొందుతుంది.
సుంకవల్లి సత్తిరాజు
9704903463