సుప్రీం కోర్టు 53 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకాన్ని ప్రకటిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు పదవిలో ఉన్న బీఆర్ గవాయ్ నవంబర్ 23న రిటైర్ అవుతారు. జస్టిస్ సూర్యకాంత్ చీఫ్‌జస్టిస్‌గా దాదాపు 15 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించిన తరువాత 65 ఏళ్ల వయసు వచ్చిన తరువాత 2027 ఫిబ్రవరి 9న రిటైర్ అవుతారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను వినియోగించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్‌ను రాష్ట్రపతి నియమించారని , నవంబరు 24న బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. హర్యానా లోని హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు.
2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జీ అయ్యారు. అత్యున్నత న్యాయ ధర్మాసనంలో రెండేళ్లు అనుభవం సంపాదించారు. ఆర్టికల్ 370 రద్దు, భావ ప్రకటన, ప్రజాస్వామ్యం, అవిపీతి. సర్యావరణం, లింగ సమానత్వం తదితర అంశాల్లో చెప్పుకోదగిన తీర్పులు వెల్లడించారు. వలసవాద దేశద్రోహ చట్టం (ఐపిసి సెక్షన్ 124 ఎ ) తాత్కాలిక నిలుపుదలకు 2022 మే 11న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునః పరిశీలించేవరకు అన్ని విచారణలు, అప్పీళ్లు , ఇతర ప్రక్రియలు పెండింగ్‌లో ఉంటాయని తీర్పు వెలువరించారు. బీహార్‌లో ఎన్నికల కమిషన్ ఓటర్ల సవరణ చేపట్టినప్పుడు మినహాయించిన 65 లక్షల ఓటర్ల వివరాలు తెలియజేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌తోసహా బార్ అసోసియేషన్లలో మూడోవంతు స్థానాలు మహిళలకు రిజర్వు చేయాలని తీర్పు చెప్పారు. ,