మెడకు బంతి తగిలి తీవ్ర గాయాలు
మృత్యువుతో పోరాడి యువ క్రికెటర్ అస్టిన్ మృతి
మెల్‌బోర్న్: ప్రాక్టీస్ సమయంలో బంతి మెడకు తగిలి మైదానంలోనే కుప్పకూలిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ బెన్ అస్టిన్ కథ విషాదాంతంగా ముగిసింది. దశాబ్దం క్రితం ఫిల్ హ్యూస్ అనే ఆస్ట్రేలియా క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలిన ఉదంతం ఇప్పటికీ క్రికెట్ అభిమానులను కలచి వేస్తూనే ఉంది. తాజాగా ఇలాంటి విషాద ఘటనే మరోసారి పునరావృతమైంది. తాజాగా మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల యువ ఆటగాడు బెన్ అస్టిన్ మెడకు బంతి బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలి పోయారు. సహచర ఆటగాళ్లు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే దాదాపు రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువ క్రికెటర్ గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది. బెన్ అస్టిన్ 20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బంతి అతడి మెడకు బలంగా తగిలింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందించారు. వైద్యులు అతన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి బెన్ మృత్యు ఒడిలోకి వెళ్లిపోయాడు. అతని మరణంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి విషాదం నెలకొంది.