మహిళల ప్రపంచకప్ 2025 భాగంగా భారత్ జట్టుతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా టీమిండియాకు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్ లిచ్‌ఫీల్డ్(119) మెరుపు శతకంతో చెలరేగింది. మరో ఓపెనర్ అలీసా హీలీ (5) త్వరగా ఔటైనా.. వన్ డౌన్ లో వచ్చిన ఎలీస్ పెర్రీతో కలిసి లిచ్‌ఫీల్డ్ భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే శతకం సాధించింది.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 133 బంతుల్లో155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న లిచ్‌ఫీల్డ్, అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. తర్వాత అర్థశతకం పూర్తి చేసుకున్న పెర్రీ 77 పరుగుల వద్ద ఔటైంది. అనంతరం ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే, చివర్లో ఆష్లీన్ గార్డ్‌నర్ ధనాధన్ ఇన్నింగ్స్ తో చెలరేగింది. భారీ బౌండరీలతో దూకుడుగా ఆడిన ఆష్లీన్ 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో శ్రీచరణీ, దీప్తి శర్మలు చెరె రెండు వికెట్లు తీయగా.. అమన్‌జోత్, క్రాంతి గౌడ్, రాధ యాదవ్ లు తలో వికెట్ పడగొట్టారు.