మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టులోకి భారీ వరద మొంథా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సింగూరు ప్రాజెక్టులోకి ఏకంగా 26,313 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దిగువకు నీటి విడుదలతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు నుండి దిగువకు 21,935 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూరు నుండి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లింది. మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో, నది నీరు ఏకంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రవేశించింది.
భక్తుల రక్షణే ప్రధానం: ఆలయ అధికారులు
భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ ఈవో చంద్రశేఖర్ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆలయం తాత్కాలిక మూసివేత వరద ఉధృతి నేపథ్యంలో ప్రధాన ఆలయాన్ని మూసివేశారు. భక్తుల దర్శనార్థం వన దుర్గ భవాని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం ముందున్న రాజగోపురంలో ఏర్పాటు చేశారు. రాజగోపురం నుండే దర్శనం భక్తులకు ఇక్కడి నుండే అమ్మవారి దర్శనాలను కల్పిస్తున్నారు. వరద తీవ్రత దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంజీరా పరివాహక ప్రాంతాలకు భక్తులు లేదా ఇతరులు వెళ్లకుండా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు.