హైదరాబాద్: సోషల్ మీడియాలో తనని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లో తాను ఏదైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకుంటే మీడియా సమావేశం పెట్టి తానే ప్రజలకు ముందు చెబుతానని వివరణ ఇచ్చారు. గురువారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ వాళ్లు తనని అడ్డంపెట్టి ఏదేదో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని, కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తాను ని చేస్తానని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్స్ నమ్మొద్దని రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ కొందరు, ఇతర పార్టీల వాళ్లు కూడా తనపై దుష్ప్రచారం చేస్తున్నాని ధ్వజమెత్తారు. తనపై వచ్చిన దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని కోరారు.