బీహార్ తరువాత, ఎన్నికల కమిషన్ 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధమైంది. ఈ ఎక్సర్‌సైజులో ఎన్నికలు త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఉంది. ఈ సంవత్సరం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంను ఇప్పుడు విస్మరించడం పెద్ద లోపం.ఈ జాబితాలో ఉన్న ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపం, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. గతంలో ఆఖరి సారిగా 2002 2004 లోనే ఓటర్ల సర్వే జరగడంతో ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టారు. ఇదివరకటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అంతా ఇప్పటి జాబితాలో కూడా సాధ్యమైనంత వరకు ఉండేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తారని చెబుతున్నారు. జాబితాలో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆధార్‌తో సహా సూచించిన 12 ధ్రువీకరణ డాక్యుమెంట్లలో దేని ద్వారానైనా తిరిగి జాబితాలో నమోదు చేయించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.
ఈ సర్వేకు సంబంధించిన మొదటి జాబితా నమూనా డిసెంబర్ 9న, తుది జాబితా ఫిబ్రవరి 7న ఎన్నికల కమిషన్ వెలువరిస్తుంది. అప్పటికీ బాధిత ఓటర్లు ఎవరైనా ఉంటే జిల్లా మెజిస్ట్రేట్‌లకు, రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు అప్పీలు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రెండోదశ ప్రక్రియ ఇది. మొదటిదశ బీహార్‌లో పూర్తయింది. బీహార్‌లో అనుభవమైన పాఠాల బట్టి తాము విధానాలను సవరించుకున్నామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు సూచించిన సూచనలను ఈసారి ఎన్నికల కమిషన్ ఎంతవరకు పాటిస్తుందో చూడాలి. బీహార్‌లో తరచుగా ఇతర ప్రాంతాలకు వలసలు, మృతి చెందిన ఓటర్లు, ఇతర తప్పుడు సమాచారం, ఇవన్నీ ఓటర్ల జాబితాల్లో గజిబిజిని సృష్టించినా, ఎన్నో లోపాలు ఉన్నాయని ముఖ్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఎత్తి చూపినా, వాటిని సరిదిద్ది జాబితాలను సంసిద్ధం చేయడం తమ విజయంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీహార్‌లోని అనుభవం చెప్పిందేమంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని స్పష్టమైంది.
అక్కడ చాలా తక్కువ వ్యవధిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఒక నెల వివరాల సేకరణకు, మరో నెల అభ్యంతరాలు, వివాదాల స్వీకరణకు వినియోగించారు. ఇప్పుడు వచ్చిన చెప్పుకోదగిన మార్పు అభ్యంతరాలు విచారించడానికి, పరిశీలించడానికి దాదాపు 54 రోజులు అధికారికంగా గడువు ఇవ్వడం. బీహార్‌లో ఆదరాబాదరాగా జాబితాల సవరణ చేపట్టడం తుది జాబితాలో గణాంక క్రమ రాహిత్యాలను బయటపెట్టింది. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మంది మహిళలుగా సంఖ్య పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పురుషులు కన్నా మహిళలే ఓటింగ్‌లో పాలొన్నారు. కానీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారు ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద మహిళా ఓటర్లు విచక్షణా రహితంగా జాబితాల నుంచి తొలగింపబడటం గమనార్హం.
తక్కువ రిజిస్ట్రేషన్‌తో పోలిస్తే అధిక మహిళా ఓటింగ్ సాధారణంగా పురుషుల వలసలను సూచిస్తుంది. సాధారణ నివాసులను తొలగించలేదని వలసవాదులను మాత్రమే తొలగించాలన్నదే తమ టార్గెట్ అని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ ఎక్కువ శాతం మహిళలు తొలగింపబడ్డారు. ఈ క్రమరాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తున్నాయి. ధ్రువీకరణ ప్రాథమిక బాధ్యత బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు కాకుండా పౌరులు, పార్టీ ప్రతినిధులు అనవసరంగా భరించవలసి వచ్చింది. రాజకీయ పోటీగురించి ఎక్కువ ఆందోళన చెందుతున్న పార్టీల సభ్యులు అర్హత ఉన్న ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం సమస్యాత్మకమే అని నిర్ధారించడం గమనార్హం. జాబితాలో గల్లంతయిన ఓటర్లు ఎవరైనా బూత్‌లెవెల్ ఏజెంట్ల ద్వారా నమోదు చేయించుకోవచ్చు. కానీ ఈ క్రమ రాహిత్యాలకు ఎన్నికల కమిషన్ స్పందించిన తీరు సరిగ్గా ఉండడం లేదు. సుప్రీం కోర్టు జోక్యం తరువాత ఎన్నికల కమిషన్ ఓటర్ల తొలగింపులో కారణాలను వివరిస్తూ సవరణలకు పూనుకుంది. సవరించిన నమూనా ఇప్పుడు విస్తృతంగా ప్రతిబింబించబడుతోంది.
బూత్ స్థాయి అధికారులు ఇప్పుడు మూడు సార్లు ఇంటింటా పరిశీలించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించడం స్వాగతించదగింది. అయితే తాత్కాలిక వలసవాదులు చట్టప్రకారం సాధారణ నివాసిగా ఉన్నప్పటికీ ఇంటింటా సర్వే చేసే సమయంలో ఎవరైతే గైరుహాజరవుతారో వారికి ఓటరు జాబితాలో చోటు లేకుండా పోయే వీలుంటుంది. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి అలాంటి ఓటర్లు ఆన్‌లైన్‌నలో ఎన్యూమరేషన్ ఫారంను నింపే వీలు కల్పించినట్టు ఎన్నికల కమిషన్ సూచిస్తున్నా అది సరిపోదు. ఈ నిబంధన డిజిటల్ అంతరాన్ని, అక్షరాస్యత సవాళ్లను విస్మరిస్తోంది. ఎన్యూమరేషన్ సమయంలో బూత్‌స్థాయి అధికారులకు సహకరించేందుకు ప్రత్యక్షంగా హాజరు కాని ఓటర్లపై అనవసర భారాన్ని మోపుతోంది. ఈ కసరత్తు భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతను ప్రభావితం చేసేలా పౌర సమాజంపైన, మీడియాపైన, పార్టీలపైన తీవ్రమైన నిఘా పాత్రను స్వీకరించే బాధ్యతను ప్రస్ఫుటం చేస్తోంది.