హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హన్మకొండ జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 412.3 ఎంఎం తీవ్రతతో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవడంతో హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక కాలనీలు జలమయంగా మారాయి. వరంగల్ నుంచి ములుగు వెళ్లే రోడ్డులో వరదలు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, హనుమకొండలో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బుధవారం కురిసిన వర్షానికి వరంగల్ నగరం జలదిగ్భంధంగా మారింది. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఫీట్ల రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో పాటు ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.