అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు, తేజస్విని తమ నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నేను కథ చెప్పగానే వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు. ఈటీవీ విన్ వారిని సంప్రదిస్తే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊరిలోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని ఆధారంగా చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్‌ను అయ్యాను. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి, హీరో అఖిల్, హీరోయిన్ తేజస్వినీ, ఈటీవీ విన్ నితిన్, సాయికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు చైతు జొన్నలగడ్డ పాల్గొన్నారు.