మన తెలంగాణ/హైదరాబాద్ : వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కల్ల్లాల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల ను సిఎం రేవంత్ ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రా ల్లో తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూ చించారు. మొంథా తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగ ల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండటం, హైదరాబాద్ సహా ఇత ర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిఎం ఆదేశించారు. మొంథా తుఫాను ప్రభావంపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు.
ఈ సందర్భంగా అధికారులతో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్ లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గుండాతిమడుగు స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోయాయని, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లీంచారని, ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తీవ్ర వర్ష ప్రభావం ఉన్నచోట ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాలని, జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సిఎం ఆదేశించారు.
నగర, పురపాలక, పంచాయతీల పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా
వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సిఎం ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సిఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సిఎం ఆదేశించారు.
తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర, పురపాలక, పంచాయతీలకు సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని సిఎం సూచించారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దు: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆర్ అండ్ బి అధికారులు ఫీల్డ్ లెవెల్లో హై అలర్ట్‌గా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అత్యవసరం అయితే తప్ప అధికారులెవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. మాన్సూన్ సీజన్‌లో ఎలాగైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామో ప్రస్తుతం కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. కాజ్ వేలు, కల్వర్టులు వద్ద ప్రమాద హెచ్చరికలతో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆర్ అండ్ బి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ సెంటర్ అన్ని జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ అయితేనే ప్రజలు రోడ్లపైకి రావాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: మంత్రి పొంగులేటి
తుఫాను ప్రభావం నేపథ్యంలో కురుస్తున్న భారీవర్షాలపై బుధవారం రెవెన్యూ, విపత్తుల నిర్వహణ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రి పొంగులేటి ఆరా తీశారు. భారీ వర్షాల వల్ల జన జీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి మంత్రి పొంగులేటి సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రాగల 24 గంటల్లో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులతో మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని సూచించారు.