మండలంలోని పోచన్నపేట ప్రాథమిక పాఠశాల కిచెన్‌లో సాంబార్ లో బల్లి పడిన సంఘటన కలకలం రేపింది. బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించే క్రమంలో సాంబర్‌లో బల్లి కనిపించింది. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేయడంతో సిబ్బంది వెంటనే ఉపాధ్యాయులకు తెలియచేయడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, స్థానిక తహసీల్దారు రామానుజన్ చారి, ఎంపీడీఓ మమతా భాయి, ఎంఈఓ వెంకట్‌రెడ్డి, మండల వైద్యాధికారి సృజనలు తక్షణమే స్పందించి పాఠశాలకు చేరుకొని బచ్చన్నపేట ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందంచే విద్యార్థులకు తగు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.