విద్యార్థుల ఆందోళనలతో దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అవామీ లీగ్ బరిలోకి దిగుతుందని ఆమె స్పష్టం చేశారు. దేశంలో తిరిగి రాజ్యాంగబద్ధ పాలన నెలకొనాలంటే తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారత్‌లో ఇప్పుడు తాను స్వేచ్ఛగా జీవిస్తున్నానని హసీనా వివరించారు. అయితే తన కుటుంబంపై హింసాత్మక దాడులకు దిగారని, ఆ నేపథ్యంలో పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం దక్కకపోతే లక్షలాది మంది అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు
ఆ ఎన్నికలను బహిష్కరిస్తారని అన్నారు. భవిష్యత్‌లో ప్రజల తీర్పు ప్రకారం అధికారంలోకి రావడానికైనా, లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు హసీనా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగబద్ధ పాలన, స్థిరత్వాన్ని తీసుకురావడం ఒక్క తమ పార్టీకే సాధ్యమన్నారు. అవామీ లీగ్‌పై నిషేధం విధించి యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓటమిని ఒప్పుకుందన్నారు. ప్రస్తుతం తమపై అసత్యాలు ప్రచారం చేయిస్తోందని ఆమె ఆరోపించారు. తనపై అభియోగాలు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కోర్టు కూడా తనకు నోటీసులు జారీ చేయలేదన్నారు. అనూహ్యంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిన హసీనా గతేడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు.