రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, జన్నారం-అంజనాపురం గ్రామాల మధ్య నిమ్మ వాగు పొంగి పొర్లుతుండగా డ్రైవర్ డిసిఎం వ్యానును వాగును దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో డిసిఎం వ్యాన్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వాహనంతో పాటు డ్రైవర్ కూడా నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. వ్యాన్, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.