ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం 51 మంది నక్సలైట్లు బీజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మందిపై సమిష్టిగా రూ 66 లక్షల వరకూ పారితోషికం అంతకు ముందు ప్రకటితం అయింది. స్థానిక అధికార యంత్రాంగం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో తొమ్మండుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సలైట్లు తమ పూర్వపు హింసా ప్రవృత్తిని వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆయుధాలతో సరెండర్ అయ్యారని ఎస్‌పి వివరించారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.
సరెండర్ అయిన వారిలో ఐదుగురు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)కు చెందిన వారు. ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్థానిక నిర్వహక దళం వారు, ఒక్కరు మిలిషియా ప్లాటూన్ కమాండర్ , 14 మంది ప్లాటూన్ సభ్యులు, 20 మంది వరకూ దిగువ శ్రేణి వారు ఉన్నారని ఎస్‌పి చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ బీజాపూర్ జిల్లా నుంచి మొత్తం 650 మంది వరకూ సరెండర్ అయ్యారు. 196మంది ఎన్‌కౌంటర్‌లలో హతులయ్యారు. ఇక దాదాపు వేయి మంది వరకూ అరెస్టు అయ్యారని పోలీసు వర్గాలు ఈ సరెండర్ నేపథ్యంలో తెలిపారు.