బీహార్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభ ర్యాలీ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ఓట్లకోసం ఏమైనా చేస్తారని, మీరు స్టేజ్ మీద డ్యాన్స్ చేయమన్నా చేస్తారని ఎగతాళి చేశారు. ముజఫర్ పూర్ లో బుధవారంనాడు ఆర్జేడీ నాయకుడు మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వీ యాదవ్ తో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తో పాటు, రాష్ట్రంలో అసమర్థ పాలన పై విమర్శలు గుప్పించారు.బీహారీలకు అతిపెద్ద పండుగ అయిన ఛత్ పూజ ఈ మధ్యనే ముగిసినా, ఆ అంశాన్ని ప్రస్తావించి, ఢిల్లీలోని కంపుకొడుతున్న కలుషిత యమునా నదిలో భక్తులు ఛత్ పూజ చేసుకుంటే, ప్రధాని మోదీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన చెరువులో స్నానం చేశారని విమర్శిస్తూ, ఆయన ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మోదీకి యమునానది కాలుష్యం పట్టదు, ఛత్ పూజ పట్టదు ఆయనకు కావల్సింది మీ ఓట్లు మాత్రమే అని రాహుల్ గాంధీ అన్నారు.
నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా బీహార్ లో అధికారంలో ఉన్నా వెనుకబడిన వర్గాలకు ఆయన చేసింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోపట్టునిలుపుకోవడం కోసం బీజేపీ నితీశ్ కుమార్ ఇమేజ్ ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.కేవలం షో కోసం నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నా, రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లోనే ఉందని, బీహార్ లో వెనుకబడిన తరగతుల సమస్యలు కానీ, సామాజిక న్యాయం కానీ ప్రధాని మోదీ పట్టదని రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోశారు. ఓట్ చోరీ ఆరోపణను పునరుద్ఘాటిస్తూ, బీహార్ లో కూడా ఓట్ చోరీ జరగవచ్చునని ఓటర్లను హెచ్చరించారు. బీజేపీ, జేడీయూ కూటమి ఓట్ల దొంగిలించడంలో నిమగ్నమైఉన్నారని అన్నారు. వారు మహారాష్ట్రలో ఓట్ల చోరీకి పాల్పడ్డారు. హర్యానాలోనూ ఓట్లు చోరీ చేశారు. ఇక బీహార్ లోనూ ఓట్లు దొంగిలించేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తారని ప్రతిపక్షనేత విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో 66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు.
బీహార్ లో సమగ్రమైన పాలన కోసం మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో అసలైన బీహారీల స్వరం ప్రతిబింబించే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వారు కృషి చేస్తారని హెచ్చరించారు. సర్ అంటే అదే అన్నారు. బీహార్ లో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి తరగతికీ ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా అని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ఆర్థిక విధానాలను దుమ్మెత్తి పోస్తూ, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా బీజేపీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను నిలువునా ముంచిందని ఆయన అన్నారు. గతంలో యుపీఏ ప్రభుత్వం ప్రఖ్యాత నలంద యూనివర్సిటీ పునరుద్ధరణకు చేసిన కృషిని గుర్తు చేస్తూ, మహా కూటమి ప్రభుత్వం బీహార్ ను విద్యారంగంలో విశ్వకేంద్రంగా చేస్తుందని రాహులు ఉద్ఘాటించారు.