మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి పురుషులకు టికెట్ ధరలు పెంచడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ రైడ్‌కు తీసుకుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ పురుషులకు రెట్టింపు చార్జీలు విధిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల బస్ పాసులపై 25 శాతం చార్జీలు పెంచడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కిస్తే ఇదంతా కుటుంబాలపై పెరిగిన భారం కాదా? అని నిలదీసారు. ఓ నెటిజన్ ఎక్స్ లో చేసిన పోస్టుకు కేటీఆర్ స్పందిస్తూ ఈ విమర్శలు చేశారు. సదరు నెటిజన్ పోస్టు చేస్తూ తెలంగాణలో ఆర్టీసీ ఇక ఏమాత్రం అందుబాటులో లేదని తాను బీటెక్ మొదటి సంవత్సరంలో తాను వెళ్లే గమ్యస్థానానికి బస్ టికెట్ ధర రూ. 30 తాను మూడో సంవత్సరం వచ్చే సరికి ఇప్పడు రూ.60 కి పెరిగిందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మంచిదే కానీ పురుషులకు ఎందుకు టికెట్ ధర పెంచుతున్నారని ప్రశ్నించారు. ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్ లో బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచిందని, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి మూడు స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై రూ. 5 పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జి రూ. 10గా ఉండగా ఇకపై రూ. 15 గా, నాలుగో స్టేజీ నుంచి ప్రస్తుత చార్జీపై రూ. 10 అదనంగా పెంచారని, ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ. 10 చొప్పున పెంచారని పేర్కొన్నారు.