కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మనుక ఓవెల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టి-20 వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఇండియా తొలుత బ్యాటింగ్‌కి దిగింది. అయితే విధ్వంసక ఆటగాడు అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఐదు ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపి వేశారు. ఆ సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. ఆ తర్వాత కొంత సమయానికి వర్షం తగ్గడంతో మ్యాచ్‌ని 18 ఓవర్లకు కుదించి మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో గిల్, సూర్యలు ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. గిల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 37, సూర్య 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 39 పరుగులు చేశారు. అయితే 9.4 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ మళ్లీ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, వరుణ దేవుడు శాంతించలేదు. దీంతో మ్యాచ్‌ని రద్దు చేశారు.