టీం ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో చేజార్చుకున్న భారత్.. ఇప్పుడు టి-20 సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఈ రోజు (అక్టోబర్ 29) తొలి టి-20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తన దృష్టిలో వన్డేల్లో టాప్-5 భారత బ్యాటర్ల ఎవరా అనే విషయాన్ని ఆసీస్ మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ వెల్లడించాడు. అయితే ఇందులో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి చోటు కల్పించినప్పటికీ.. టాప్-2 ప్లేస్‌లు మాత్రం ఇప్పటితరం స్టార్లకు ఇచ్చాడు. టాప్-2 లో విరాట్‌కి మొదటి స్థానం, రోహిత్‌కి రెండో స్థానం ఇచ్చిన మెక్‌గ్రాత్.. ఆ తర్వాతి స్థానాల్లో సచిన్, ధోనీ, యువరాజ్ సింగ్‌లకు చోటు కల్పించాడు.
ఈ సందర్భంగా రోహిత్‌పై మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ గణాంకాలు చాలా బాగున్నాయని అన్నాడు. ‘‘వన్డేల్లో రోహిత్‌కి మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్కోర్ 264 రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. ఇప్పటివరకు 276 మ్యాచుల్లో 11 వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చాడు. రోహిత్ ఒక క్లాస్ ప్లేయర్. అందుకే అతడికి రెండో స్థానం ఇచ్చాను. ఇక ఈ లిస్ట్‌లో తొలి ప్లేస్ విరాట్‌కే. అతడిని కాదని మరొకరికి ఇవ్వడం చాలా కష్టం. అతడి స్ట్రైక్‌రేట్, సగటు అద్భుతం’’ అని మెక్‌గ్రాత్ అన్నాడు.