మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు(95) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ కన్నుమూశారు. హరీష్‌రావు తండ్రి, తన బావ (7వ సోదరి లక్ష్మమ్మ భర్త) తన్నీరు సత్యనారాయణ మృతిపట్ల మాజీ సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్‌రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్‌లో ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. తన బావ సత్యనారాయణ భౌతికకాయానికి కెసిఆర్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు కెసిఆర్ ధైర్యం చెప్పారు. హరీష్‌రావును గుండెలకు హత్తుకుని కెసిఆర్ ఓదార్చారు.
కెటిఆర్, ఇతర నేతల నివాళులు
హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ పార్ధివదేహానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కెటిఆర్ నివాళులర్పించారు. హరీష్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్పారు. అలాగే బిఆర్‌ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన రా జకీయ ప్రముఖులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు హరీష్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంతాపం తెలిపారు.
సిఎం రేవంత్‌రెడ్డి సంతాపం
మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ హరీష్‌రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ రావు పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. మంత్రి దామోదర రాజనర్సింహ మహాప్రస్థానంలో హరీష్‌రావు తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హరీష్‌రావు తండ్రి మృతి పట్ల మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్ సంతాపం తెలిపారు. మన తెలంగాణ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్ హరీష్‌రావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రి సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
ఎపి సిఎం చంద్రబాబు సంతాపం
బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.
హరీశ్‌రావుకు జగన్ ఫోన్
మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఎపి మాజీ సిఎం, వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. హరీష్ రావును జగన్ ఫోన్‌లో పరామర్శించారు.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి
మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మంగళవారం సాయంత్రం పూర్తయ్యాయి. కోకాపేటలోని హరీష్‌రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై, మహాప్రస్థానం వద్ద ముగిసింది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి తమ భుజాలపై సత్యనారాయణ పాడె మోసారు. సత్యనారాయణ అంతిమయాత్రలో కెటిఆర్ సహా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్,జగదీష్‌రెడ్డి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బిఆర్‌ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు
మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మృతి నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్‌లో పార్టీ ప్రచార కార్యక్రమాలను బిఆర్‌ఎస్ పార్టీ మంగళవారం రద్దు చేసింది.