టీం ఇండియా ఎంపిక విషయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి బిసిసిఐ సెలక్టర్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. షమీ ఫామ్ గురించి తమ వద్ద సమాచారం లేదంటూ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అనగా.. షమీ తన ఫామ్ గురించి అందరూ చూస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు. అయితే తాజాగా షమీ తన ప్రదర్శనతో సెలక్టర్లకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ బెంగాల్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీజన్ రెండో మ్యాచ్‌లో బెంగాల్.. గుజరాత్ జట్టుతో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో షమీ ఏకంగా ఎనిమిది వికెట్ల పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్.. తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ కేవలం 167 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగాల్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని బెంగాల్.. గుజరాత్‌కు 327 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఈ ఇన్నింగ్స్‌లో చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్ అభిషేక్ దేశాయిని డకౌట్ చేశాడు. జయమీత్ పటేల్ (45), విశాల్ జైస్వాల్ (1), సిద్దార్థ్ దేశాయ్ (0), అర్జాన్ నాగ్వాస్వల్లా (0)లను ఔట్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయింది. బెంగాల్ 141 పరుగులతో విజయం సాధించింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసిన షమీ.. తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడిన వారందరి నోళ్లు మూయించాడు.