బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అన్నిరాజకీయపార్టీలు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమి మహాఘట్పంధన్ తాజా మ్యానిఫెస్టో ను ఆర్జేడీ నాయకుడు తేజశ్వీ యాదవ్ విడుదల చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, బీహార్ లో అన్ని కుటుంబాలకూ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. మరో 20 రోజుల్లో ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వబడుతుందని తేజశ్వీ యాదవ్ ప్రకటించారు. 25 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను ఆయన విడుదల చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సిపిఐ ఎంఎల్ కు చెందిన దీపంకర్ భట్టాచార్య , వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ చీఫ్ ముకేష్ సహాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీహార్ లో జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పించడం, కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, పాత పెన్షన్ పథకాన్ని తిరిగి అమలు చేయడం మ్యాని ఫెస్టోలో మరి కొన్ని ముఖ్య అంశాలు. మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తాము ముందే ప్రకటించామని, వచ్చే ఐదేళ్లలో తాము ఎలా పనిచేయబోతున్నామో వివరించేందుకే తేజశ్వీ ప్రాణ్ పత్ర విడుదల చేస్తున్నట్లు తేజశ్వీయాదవ్ వెల్లడించారు.ఎన్డీఏ కూడా తమ ముఖ్యమంత్రి పేరు ప్రకటించాలని తేజశ్వీ డిమాండ్ చేశారు. అలాగే ఏ పథకాలు ప్రకటించబోతున్నారు.
వారి విజన్ ఏమిటి, బీహార్ ను ఏలా ముందుకు తీసుకువెళ్లబోతున్నారని ఆయన నిలదీశారు. మహాఘట్బంధన్ కు ఓ రోడ్ మ్యాప్ ఉంది, ఓ విజన్ ఉంది. బీహార్ ను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు తాము కృషిచేస్తామన్నారాయన. ఎన్డీఏ ఇప్పటివరకూ మ్యానిఫెస్టో విడుదల చేయకపోవడాన్ని ఎద్దేవా చేశారు.నిజానికి ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వియాదవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాహుల్ గాంధీ ఫోటో మ్యానిఫెస్టో పత్రం కవర్ లో ఒక మూల చిన్నగా కన్పించింది.