టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆటో అవతారం ఎత్తారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళలో ఏనాడూ ఆటోవాలాల గురించి పట్టించుకోని కెటిఆర్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వారిపై ఎనలేని ప్రేమ కురిపిస్తూ, కొత్త డ్రామా ప్రారంభించారని ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో దుయ్యబట్టారు. పదేళ్ళలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటోలపై సుమారు నలభై కోట్ల రూపాయల చలాన్లు విధించారని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ సిలిండర్‌పై ధరలు తగ్గించామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని ఆయన చెప్పారు. లక్షకుపైగా జీరో టిక్కెట్స్ మహిళలకు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు.
తెలంగాణను న్యూయార్క్, ఇస్తాంబుల్ చేస్తామని చివరకు చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ దేనిపైనా చూపించలేదన్నారు. నీరు కెసిఆర్ ఫామ్ హౌస్‌కు, నిధులు కెసిఆర్ కుటుంబ సభ్యులకు వెళ్ళాయని ఆయన విమర్శించారు. ఇక నియామకాల విషయానికి వస్తే ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కెసిఆర్ కుటుంబ సభ్యులకే దక్కాయని ఎంపి చామల విమర్శించారు. తమ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందని కెటిఆర్ మాయ మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో కేంద్రం నుంచి ఆశించిన విధంగా నిధులు రావడం లేదని ఆయన తెలిపారు. అప్పుల రాష్ట్రంగా మార్చకుండా ఉంటే ఎప్పుడో అభివృద్ధి చెందేదని ఎంపి చామల అన్నారు.