హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్ కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి పేర్కొన్నారు.మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని, సిఎం రేవంత్ రెడ్డి పిలుపుతో మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పారు.
బండి ప్రకాష్ పై ఉన్న రూ. 20 లక్షల రివార్డు ఆయనకే ఇస్తామని, పుల్లూరి ప్రసాద్ రావు పై రూ.25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని హామి ఇచ్చారు. చంద్రన్న 15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. చంద్రన్న ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో అజ్ఞాతం వీడారని, ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన 64 మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. 64 మందిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని, మరో 10 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.