టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టి-20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి నిరాశ పరిచిన కోహ్లీ. చివరి వన్డేలో మాత్రం 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తన ఫామ్ ఇంకా తగ్గలేదని విమర్శకులకు నిరూపించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన చూసిన సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్, కోహ్లీ స్నేహితుడు ఎబి డివిలియర్స్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇంకో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని తనకు అనిపిస్తుందని ఎబిడి అన్నాడు. తన అభిప్రాయం 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపిఎల్‌లో కొనసాగుతాడని వెల్లడించాడు. మరో ఐదేళ్ల కోహ్లీ మనకు మైదానంలో కనిపిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ కంటే ప్రపంచకప్ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపాడు.
అయితే విరాట్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని డివిలియర్స్ పేర్కొన్నాడు. ‘‘జట్టులో కోహ్లీ ఉంటే చాలు.. మిగితా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఇతర ప్లేయర్ల మదిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతారు. మరో విషయం ఏంటంటే.. వారు కొన్నిసార్లు బ్యాట్‌తో మంచి ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టుపై తమదైన ముద్ర వేయగలరు’’ అని ఎబిడి అన్నాడు.