శత్రువును జయించాలంటే కేవలం భుజబలం మాత్రమే ఉంటే చాలదు. పరిస్థితులను బట్టి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తేనే ఫలితం సానుకూలమవుతుంది. ఆవేశమే తప్ప ఆలోచన అంతగా లేని అగ్ర రాజ్యాధినేత ట్రంప్ మహాశయుడికి ఈ విషయం గ్రహించడానికి పది నెలల సమయం పట్టిందంటే ఆశ్చర్యం ఏముంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడం తనకు చిటికెలో పని అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తాను అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రతినలు పలికారు. కానీ, రాజకీయాల్లో రష్యా అధినేత పుతిన్ తనకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారన్న వాస్తవం గ్రహించడానికి ఆయనకు ఇంతకాలం పట్టింది. ఉక్రెయిన్ యుద్ధ విరమణ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ పురిట్లోనే సంధి కొడుతున్నారు. అలస్కాలో గత ఆగస్టు నెలలో పుతిన్ తో జరిగిన ముఖాముఖీ భేటీలో ఫలితమేమీ తేలకపోవడంతో ట్రంప్ అహం దెబ్బతింది. యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ లో కొన్ని భూభాగాలను తమకు దఖలు పరచాల్సిందేనంటూ మొండికేస్తున్న పుతిన్ ను దారికి తెచ్చేందుకు తాజాగా ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్షల కొరడా ఝళిపించారు.
ఈ పరిణామం పుతిన్ ను ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి. రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్ నెఫ్ట్, లుకాయిల్‌పై అమెరికా, ఐరోపా కూటమి విధించిన ఆంక్షల ప్రభావం రష్యా తోపాటు భారత్, చైనాలపై ఎక్కువగా పడింది. ఆ రెండు కంపెనీలకూ అనుబంధంగా పనిచేస్తున్న పలు సంస్థలకూ ఆంక్షలు వర్తింపజేయడంతో రష్యా నుంచి చమురు ఎగుమతులు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. తాజా ఆంక్షలతో 557 చమురు షాడో కంపెనీలపై నిషేధం పడినట్లయింది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకున్న నిర్ణయం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. చమురును రవాణాచేసే సూపర్ ట్యాంకర్ల చార్జీలు ఒక్క రోజే 16 శాతం పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ. గత రెండేళ్లలో ఇలా చార్జీలు పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా ఆంక్షలకు తలొగ్గేది లేదంటూ పుతిన్ బీరాలు పలుకుతున్నా చమురు కొనుగోళ్లు నిలిచిపోతే, ఇప్పటికే యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం అసాధ్యమన్న సంగతి ఆయనకు తెలియనిదేమీ కాదు.
తాజా ఆంక్షల వల్ల రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సామర్థ్యం తగ్గుతుంది. దీంతోపాటు దాని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలహీనవడుతుందనేది నిర్వివాదాంశం. అయితే ఆంక్షలు ఎంతమేరకు కట్టుదిట్టంగా అమలవుతాయో వేచి చూద్దామనే ధోరణిలో ఆయన ఉన్నట్లు కనబడుతోంది. ఒకప్పుడు పుతిన్ ను టఫ్ గై, స్మార్ట్ గై అంటూ ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ కు పుతిన్ అసలు రూపం ఇప్పుడు బోధపడినట్లుంది. తాజాగా బుడాపెస్ట్ లో ఇరువురు అధినేతల మధ్య జరగవలసిన భేటీని పుతిన్ రద్దు చేసుకోగా, ఫలితం తేలని చర్చల వల్ల ప్రయోజనమేమిటంటూ ట్రంప్ పెదవి విరచడానికి కారణం అదే. భారత్ విషయానికొస్తే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ రష్యా చమురును చౌకగా కొనుగోలు చేస్తోంది. భారత ముడిచమురు అవసరాల్లో మూడో వంతు భాగం రష్యానుంచే దిగుమతి అవుతోంది.
ఈ ఏడాది ఇప్పటివరకూ సగటున రోజుకు 1.7 మిలియన్ బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటే, ఇందులో 1.2 మిలియన్ బారెళ్ల చమురు తాజాగా నిషేధం వేటు పడిన రెండు సంస్థలనుంచే రావడం గమనార్హం. ఈ దిగుమతుల్లో అధిక వాటాను రిలయన్స్, నయారా ఎనర్జీ సంస్థలే కొనుగోలు చేస్తుండగా, స్వల్ప పరిమితిలో భారత ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ లెక్కల ప్రకారం రష్యానుంచి భారత్ కు ప్రతి నెలా సుమారు ఏడు మిలియన్ బారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. ప్రపంచ ముడి చమురు, రిఫైన్డ్ వినియోగంలో ఇది ఏడు శాతానికి సమానం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోక తప్పని పరిస్థితుల్లో భారత్ కు మళ్లీ పశ్చిమాసియాయే దిక్కయ్యేటట్లు కనిపిస్తోంది. అదే జరిగితే, ప్రస్తుతం భారత్ పై 50 శాతానికి పెంచిన సుంకాలను అమెరికా 15 శాతానికి తగ్గించే అవకాశం లేకపోలేదు.