ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక సంబంధం భారత రాజకీయశక్తి, కార్పొరేట్ ప్రభావం మధ్య ఉన్న అనుబంధం మళ్లీ చర్చను రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని మోడానీ నెక్సస్ అని పిలుస్తూ, ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల మధ్య సంబంధాలు గట్టిపడి సామాన్యుల బతుకు బజారుకీడ్చిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా అదానీ గ్రూప్ విస్తరణతోపాటు, నియంత్రణ సడలింపులు, ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ ప్రాధాన్యత వంటి ప్రశ్నలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. ఈ చర్చను మరింత వేడెక్కించినవి రెండు ప్రధాన పరిణామాలు ఒకటి 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఇది అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేసింది, గత వారంలో ది వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ సహకారంతో జరిగిన బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్. ఇవి రెండూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థికశక్తి, రాజకీయ అధికారాల అంతర్గత బంధంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి. మోడీ అదానీ బంధం మూలాలు 2000 ప్రారంభంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలం నుంచి ఉన్నాయి. 2014లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదానీ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. అతని ఆస్తులు 230 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరాయి.
పోర్టులు, విమానాశ్రయాలు, శక్తిరంగాల వంటి కీలక రంగాల్లో అదానీ కంపెనీలు పెద్ద కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. 2018లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిబంధనలు మార్చబడటంతో, విమానయాన అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అదానీ ఆరు ప్రధాన విమానాశ్రయాలపై నియంత్రణ సాధించాడు. కేరళ ఆర్థిక మంత్రి దీన్ని నిర్లజ్జమైన స్నేహపూర్వక వ్యాపారంగా అభివర్ణించారు. విపక్ష పార్టీలు ఈ పరిణామాలు యాదృచ్ఛికం కావని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ కంపెనీలు బిజెపికి భారీ విరాళాలు ఇచ్చి, ప్రతిగా విధాన సడలింపులు పొందుతున్నాయని ఆరోపిస్తున్నాయి.2025 జూన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య – డబ్బు, విధానం మీది, లాభం, సౌలభ్యం అదానీది ఈ ఆరోపణలకు ప్రతీకగా నిలిచింది. బిజెపి నేతలు ఈ విమర్శలను కొట్టి, అదానీ ఎదుగుదల మోడీ నాయకత్వంలో దేశ నిర్మాణానికి సంకేతమని చెబుతున్నారు.
మోడీ అదానీ అనుబంధం క్రోనీజంను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మార్కెట్ న్యాయాన్ని ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, అదానీపై ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మోసం ఆరోపణలు చేసింది.ఈ నివేదికలో షేర్ ధరల మానిప్యులేషన్, తప్పుడు లెక్కలు, మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల ద్వారా మార్కెట్ విలువ పెంపు వంటి అంశాలు వెల్లడించబడ్డాయి. ఫలితంగా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు కోల్పోయింది. అలాగే ఎల్‌ఐసి 5.6 బిలియన్ డాలర్ల నష్టపోయింది. అదానీ దీన్ని భారత దేశంపై కుతంత్ర దాడిగా పేర్కొని, వ్యతిరేకంగా 413 పేజీల వివరణ ఇచ్చారు. సెబీ కొన్ని ఆరోపణలను కొట్టివేసినా, విదేశీ పెట్టుబడులపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ది వాషింగ్టన్ పోస్ట్ మరో ప్రకంపన రేపింది.
ఆ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం ఎల్‌ఐసి ద్వారా 3.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రణాళికను రూపొందించి. అదానీ కంపెనీల బాండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టించిందని తెలిపింది. అప్పట్లో అదానీ గ్రూప్ అప్పులు పెరుగుతుండగా, ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లను సాకుగా చూపి ఎల్‌ఐసి నిధులను వినియోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జైరాం రమేష్ దీనిని మోడానీ మెగా స్కామ్‌గా పేర్కొనగా, మల్లికార్జున ఖర్గే ప్రజల బీమా పొదుపులు కార్పొరేట్ రక్షణకు వినియోగించబడ్డాయని విమర్శించారు. ఎల్‌ఐసి అదానీ కంపెనీలు ఈ ఆరోపణలను అసత్యంగా కొట్టి, పెట్టుబడులు వ్యాపారపరమైనవే అని స్పష్టం చేశాయి. పోర్టులు, విద్యుత్, రవాణా వంటి కీలక రంగాల్లో అదానీ గ్రూప్ దేశపు మౌలిక వసతులలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. మద్దతుదారుల దృష్టిలో ఇది దేశ ఆత్మనిర్భరతకు ప్రతీక, విమర్శకుల దృష్టిలో ఇది స్నేహపూర్వక పాజీవాదంకి చిహ్నం. ఈ పరిణామాలు కార్పొరేట్ పాలనకే కాదు, సాధారణ ప్రజలకూ ప్రమాదకర సూచనలు ఇస్తున్నాయి. ఎల్‌ఐసి, పెన్షన్ నిధులు వంటి ప్రజాసంస్థలు రాజకీయ నిర్ణయాల ప్రభావానికి లోనవుతుండటం, ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా, మోడీ అదానీ సంబంధం కేవలం ఇద్దరి వ్యక్తుల గాథ మాత్రమే కాదు, ఇది ఉదయోన్ముఖ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారాలు ఆర్థిక శ్రేణులను ఎలా మలుస్తాయన్న సందేహం కలుగుతుంది.
– డా. ముచ్చుకోట సురేష్ బాబు, 9989988912