న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ తీవ్ర తుపానుగా బలపడింది. ఈ తుఫాను ఇవాళ తీరాన్ని తాకనుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. ప్రజల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ తుఫానుతో ఎపికి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. 8 నుంచి10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖలో భీకర గాలులతో కుండపోత వర్షం పడుతోంది.
ఇక, నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మంగళవారం ఉదయం తుఫానుగా బలపడటంతో 2 నుండి 4.7 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని IMD అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మరోవైపు, తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ పడి అకాశం ఉండటంతో మూడు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు.