పూణే: పాకిస్తాన్‌లోని అల్ ఖైదా వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయని మరియు యువతను తీవ్రవాదంలోకి మార్చడంలో పాత్ర ఉందని ఆరోపణలపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) పూణేలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసింది. అక్టోబర్ 9న మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా గత నెల నుండి ATS నిఘాలో ఉన్న గోండ్వా ప్రాంతానికి చెందిన జుబైర్ హంగర్కేకర్ (35) ఇంట్లో దాడులు నిర్వహించింది. జుబైర్ ల్యాప్‌టాప్‌తో సహా మొత్తం 19 ల్యాప్‌టాప్‌లు, 40 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను జుబైర్ హంగర్‌కేగర్ ల్యాప్‌టాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తేలింది.
జుబైర్ హంగర్గేకర్‌ను అరెస్టు చేసి ప్రత్యేక UAPA కోర్టులో హాజరుపరిచారు. హంగర్గేకర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడని, మహారాష్ట్రతోపాటు ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, యువతను తీవ్రవాదంలోకి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో కోర్టు అతన్ని నవంబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అలాగే, చెన్నై నుండి పూణే రైల్వే స్టేషన్‌కు వచ్చిన జుబైర్ స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు.