రెండు నెలలైనా ఇంతవరకు స్పందన లేదు
నవంబర్ 3న సిఎస్‌లు మా ముందుకు రావాలి
రాష్ట్రాలు, యుటిలకు సుప్రీం ఆదేశాలు
అవసరమైతే ఆడిటోరియంలో బహిరంగ
కోర్టు ఉత్తుత్తి మాటలు కాదు.. విచక్షణాయుత సూచనలు చేయాలని న్యాయవాదికి హితవు
ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ నుంచే అఫిడవిట్లు
న్యూఢిల్లీ : వీధి కుక్కల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తీరుపై ఘాటుగా స్పందించింది. ‘ ఇప్పుడు అక్టోబర్ 27వ తేదీ. వీధుల్లో తిరిగి కరుస్తోన్న కుక్కలతో తలెత్తుతున్న ముప్పును అరికట్టాలని పలు సార్లు చెప్పాం. ఎటువంటి స్పందన గట్రా లేదు. నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు. ఇప్పటికీ వీధి కుక్కల కాట్లు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చివరికి అవి ఇక్కడికి వచ్చిన విదేశీయులను కూడా వదలడం లేదు. దీనితో మీ మన దేశం పరువు విదేశాలలో దిగజారుతోంది. ఇదైనా తెలుసుకున్నారా? ’ అని న్యాయమూర్తులు విక్రమ్‌నాథ్, సందీప్ మెహతా, ఎన్‌వి అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. పిచ్చికుక్కల స్వైరవిహారం ఘటనల్లో రాష్ట్రాల, యుటిల ఉన్నతాధికారులకు తాఖీదులుపంపించాం. ముందు తమ వివరణలతో కూడిన అఫిడవిల్లు అడిగాం. అయితే వారేం చేస్తున్నారో తెలియదు.
ఇప్పటివరకూ ఎటువంటి స్పందనా లేదని మందలించారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్ , ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తప్పితే ఇతర రాష్ట్రాలు, యుటిలు ఈ విషయంలో ఉలుకూపలుకూ లేకుండా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంపై తాము ఆగస్టు 22వ తేదీన వెలువరించిన ఆదేశాలను ప్రస్తావించింది. ఇప్పటికి ముచ్చటగా మూడు సమాధానాలు , చర్యలకు దిగుతామనే వివరణలు అందాయని తెలిపారు. అఫిడవిట్లు అందించకుండా తిరుగుతున్న రాష్ట్రాలు, యుటిల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంతా కూడా వచ్చే నెల 3వ తేదీన తమ ముందుకు వచ్చి హాజరు కావాలని, ఎందుకు తమ వివరణలు ఇచ్చుకోలేదనేది తెలియచేసుకుని తీరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆగస్టు 22 నాటి ఆర్డర్ పట్టించుకోరా?
ఆగస్టు 22 నాటి తమ ఆర్డర్ అంటే లెక్కలేదా? అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్రాలకు , యుటిలకు నోటీసులు వెలువరించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇక సిఎస్‌లు తమ ముందుకు రావాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. పిచ్చి కుక్కల కాట్లు, వీధుల్లో అవి సైర్వవిహారం చేయడం, ఆక్సిడెంట్లకు దారితీయడం వంటి అంశాలపై కోర్టు తనకు తానుగా స్పందించిన సుమోట్ విచారణ దశలో త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. కుక్కల బెడద, దీనితో పాటు అధికారుల అలసత్వం మరో తీవ్ర సమస్య అవుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతకు ముందటి వరకూ ఢిల్లీ ఎన్‌సిఆర్ వరకూ పరిమితం అయి ఉన్న ఈ కేసును ఆగస్టులో న్యాయస్థానం ఇతర రాష్ట్రాలు, యుటిల పరిధికి తీసుకువచ్చింది. అక్కడ తీసుకుంటున్న చర్యల వివరాలను ఆరాతీసింది.
ఉన్నతాధికారులు పత్రికలు చదవరా? సోషల్ మీడియా చూడరా? నోటీసులు పంపించేంత వరకూ చలనం లేకుండా ఉంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు మూడు నెలలు గడిచినా ఇప్పటికీ పిచ్చి కుక్కల బెడద సాగుతోంది. అధికారుల సడీసప్పుడు లేదు. ఇక్కడికి వచ్చిన విదేశీయులపై, చివరికి ప్లే గ్రౌండ్‌లలో ప్రాక్టిస్ చేసుకునే విదేశీ ఆటగాళ్లపై కూడా కుక్కలు దాడులకు దిగాయి. మరి దేశ పరువు ఏమవుతుందనేది ఆలోచించారా? అని ఘాటుగా స్పందించారు. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల అరాచకాలతో ప్రతిష్ట దెబ్బతింటోంది. ఇప్పటికైనా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమ ముందుకు హాజరు కావాలని ఆదేశిస్తున్నట్లు సంబంధిత లాయర్లకు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ లాయరు స్పందిస్తూ మూగజీవాలైన కుక్కల పట్ల క్రూరత్వం గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మరి మనుష్యులపై జరుగుతోన్న ఆటవికం సంగతి మరిచిపోతున్నారా? అని ప్రశ్నించింది. విచక్షణాయుత సూచనలు ఉంటే తెలియచేయండి, ఆచరణాత్మకం అయితేనే మాట్లాడండి. ఉత్తుత్తి మాటలు వద్దు. మీరు చెప్పేది ఏమైనా ఉంటే మేం నమ్మి ఆమోదించి , సముచితం అన్పించుకునేలా ఉండాలి అంతేకానీ పరమ చెత్త శుష్క వాదన కోర్టు ముందుకు తీసుకురాకండని మందలించారు. తాము పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని, ఏ విధంగా బెడదకు పరిష్కారం కుదర్చాలనేది ఆలోచిస్తున్నామని చెప్పారు. నవంబర్ 3న చీఫ్ సెక్రెటరీలు అంతా న్యాయస్థానానికి రావాల్సిందే. కాదు కూడదు అనుకుని రాకుండా ఉంటే ఇక తాము ఆరోజు కోర్టు విచారణను బహిరంగ స్థాయిలో ఆడిటోరియంలో నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
ఢిల్లీ, గజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్ ఇతర ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రస్థాయి దశలో ఆగస్టు 11న సుప్రీంకోర్టు తన రూలింగ్ వెలువరించింది. వీధి కుక్కలన్నింటిని ఏరి వాటికి ముందుగా వాక్సిన్‌వేసి తరువాత వదిలిపెట్టాలని పేర్కొంది. అయితే రేబిస్ సోకిన వాటికి ఇది వర్తించదని, వాటిని తగు విధంగా సంరక్షణ షెడ్లలోనే ఉంచాలని తాము సూచించామని, అంతేకానీ వాటిని కూడా ఇతర కుక్కలతో పాటు వదిలేస్తే తప్పని పేర్కొన్నారు. ఇక పిచ్చికుక్కల బెడద వీడకుండా ఉన్నందున తాము ఆగస్టు 11ప తేదీన వెలువరించిన వీధి శునకాలను ఆ తరువాత విడిచిపెట్టాలనే ఆదేశాలపై పునరాలోచించుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఎందుకంటే వ్యాక్సినేషన్ అయిన రేబిస్ కుక్కలను కూడా ఈ కుక్కలతో పాటు విడిచిపెట్టడం జరుగుతోంది. దీనితో సమస్య మొదటికి వస్తోందని వ్యాఖ్యానించారు.