మన తెలంగాణ/హైదరాబాద్ : మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్, పోలీస్ ఎన్ కౌంటర్‌లో మృతి చెందిన తన కుమారుడు రియాజ్‌ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సోమవారం రియాజ్ తల్లి జరీనాబేగం, భార్య సనోబెర్ నజ్మీన్‌లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కు తన కుమారుడు రియాజ్‌కు మధ్య నగదు లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు.
రియాజ్‌ను మూడు లక్షలు డిమాండ్ చేశారని, వాటిలో రూ. 30 వేలు ఇచ్చామని తెలిపారు. రియాజ్‌ను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ప్రమోద్ అధికారికంగా విధుల్లో లేడని, రూ. 30 వేలు తీసుకున్న తరువాత కానిస్టేబుల్ పలు మార్లు తన కుమారుడికి కాల్ చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో పాటు రియాజ్ పారిపోయాడని చెప్పిన రోజు పోలీసులు తమ కుటుంబాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి చట్ట విరుద్దంగా వ్యవహరించారని తెలిపారు. రియాజ్ గురించి సమాచారం తెలియదని చెప్పినా.. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదులో చెప్పారు. పోలీసులు పట్టుకున్న రియాజ్‌ను బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని, తరువాత సైతం మృతదేహాన్ని బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించే విధంగా పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో తెలిపారు.
కాగా, ఇప్పటికే రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన కమిషన్ నవంబర్ 24వ తేదీ లోపు ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని డిజిపిని ఆదేశించింది. ప్రస్తుతం రియాజ్ కుటుంభ సభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఎన్‌కౌంటర్ నివేదికను నవంబర్ 3వ తేదీ లోపు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రియాజ్ కుటుంభ సభ్యులపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని కమిషన్ ఆదేశించింది.