లక్నో: న్యాయ విద్యార్థి పొట్టను కోసి, చేతి వేళ్లను నరికి అనంతరం తీవ్రంగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లో అమర్ సింగ్, విజయ్ సింగ్ అనే అన్నదమ్ములు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. 22 ఏళ్ల న్యాయ విద్యను అభ్యసిస్తున్నాడు. అమర్ సింగ్ మెడికల్ షాపులో సదరు విద్యార్థి మెడిసిన్ తీసుకున్నాడు. మెడిసిన్ల ధరల విషయంలో న్యాయ విద్యార్థితో ఇద్దరు గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు అన్నదమ్ములు మరో ఇద్దరు రాజ్ శ్రీవాత్సవ్, నిఖిల్‌తో కలిసి అతడిపై దాడికి దిగారు. లా విద్యార్థి పొట్టను కోయడంతో రోడ్డుపై పరుగులు తీశాడు. అనంతరం అతడి చేతి వేళ్లను నరికి వేశారు. అతడు రక్తపుమడుగులో పడిపోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. తల, పొట్ట భాగంలో బలమైన గాయాలు ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తలకు 14 కుట్లు వేశామని అధికారులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.