అమరావతి: మొంథా తుఫాన్ దూసుకువస్తుంది. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎపిలోని ఉత్తరాంధ్రలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో కురిసే వర్షాలపై ఎపి డిజాస్టర్ మేనేజ్మెంట్ వెదర్ అవుట్ లుక్ విడుదల చేసింది. 27, 28, 29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. కాకినాడ, కోనసీమ జిల్లాలకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మొంథా తుఫాన్ ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో సిఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రాణ, పశు, ఆస్తి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తుపాను సమీక్షలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులకు తెలిపారు.
కాకినాడ పోర్ట్ లో 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తుఫాన్ ప్రత్యేక అధికారిగా కృష్ణతేజ తెలిపారు. యాంకరేజ్ పోర్ట్, డిప్ వాటర్ పోర్ట్ లో కార్యకలపాలు నిలిపివేశామని, సురక్షిత ప్రాంతానికి 13 నౌకలు తరలించామన్నారు. హోప్ ఐలాండ్ నుండి 110 మంది మత్స్యకారులు తరలించామని, ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డు మూసివేశామని వెల్లడించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నేటి నుండి ఐదు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్ షాన్ మోహన్నే పేర్కొన్నారు. తుఫాన్ సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్న” బ్లూ బ్యాచ్ ” సమాజానికి ప్రమాదంగా మారిందని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో వ్యాధుల నియంత్రణకు మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు.