తలిరాకుల తారళ్యం, పాలకుల కాఠిన్యం
దేని గురించైనా రాయచ్చు కవి నిరంకుశుడు కదా!
జాతీయ పర్వదినాలు, జెండా పండుగలు
సంచలన సంఘటనల ప్రమాదాలవార్తలెందుకు?
కవిత్వం పేరిట ఖూనీలెందుకు?
అక్షరాలకు ఉరిశిక్షలు అవిరామ సంగ్రామాలు
బాంబుల దాడులు, క్షిపణుల ప్రయోగాలు
తీరని రూపాయల దాహం, బాల్యం, పావురం ఎగరని బాలలు
ఇంకా వస్తువులుగానే మిగిలిన మహిళలు
ఉక్కబోతల వేసవికాలాలు
నియంతృత్వం బోనులో ప్రజాస్వామ్యం
పంచవర్ష ప్రణాళికలెన్ని గడిచినా
ఆకలి ఋతువులు పలకరించే పేదలు
దేశాధిపతులకు త్రివిధ దళాధిపతులను
తన కనుసన్నల్లో పాలించే పాలకులకైనా
ఒళ్ళంతా ప్రశ్నల కత్తులున్న పద్యమంటే భయం
అక్షరం ఆటంబాంబులను తలచుకొంటే నిద్రకు దూరం
సంకెళ్ల పూలమాలలను మణికట్టుకు చుట్టి
కారాగార బహుమతులనిస్తారు
కవిత్వమే ఉంటే రాజ్యమెందుకు?
కవిత్వమంటే తపస్సు, కవి అంటే ఋషి కదా!
అన్యాయాలను అక్రమాలను ధిక్కరించి
మతం మత్తులో, కులం కుళ్ళులో, మద్యం నిషాలో
జోగుతున్న ప్రజలను మేలుకొల్పేలా రాయి
ఇన్నేళ్ళ స్వాతంత్య్రంలో
కూడు కోసం, గూడు కోసం పలుయాతనల
చాకిరియంత్రాలు చెమట జీవుల కతలగురించి
రాయి సమాజంలో సగం స్త్రీలు
నీతో సమానంగా గుర్తించేలా రాయి
కల్లోల కడలిలో తిరగబడిన బతుకుపడవల గురించి రాయి
దిగులు గొంగళి పురుగు క్షణ క్షణం కొరికి తినేస్తుంటే
బతుకుతున్న శరీరంలో మరణిస్తున్న మనసు గురించి రాయి
గట్లు తెంచుకున్న చెరువులా రాయకుండా ఉండలేనపుడే రాయి
ఆర్థిక సంబంధాలు తప్ప, మానవ సంబంధాలు మాయమై
ఒంటరితనం చీకట్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న
చెక్కిలి మీద కారేకన్నీటిని తుడిచేలా రాయి
మట్టిగోడల్ని బద్దలుకొట్టుకొని, విజయకేతనం ఎగరవేసే విత్తనంలా
గుడ్డుని పొడుచుకొని రెక్కలు విదిలించి మొదటిసారి ఎగిరే పక్షిలా
పరమేశ్వరుని ఢమరుకం నుంచి
వెలువడిన అక్షరాల జల్లులా రాయి
ఏదైనా నీలోనుంచి, లోపలినుంచి
లోలోపలి పొరలను చీల్చుకుంటూ, ఆర్తరావంలా ఆగ్రహనాదంలా,
ఉప్పెనై ఎగసిపడేలా నిప్పులై జ్వలించేలా
ధూర్జటిలా, పోతనలా ధిక్కార స్వరమైరాయి
రాయకుండా ఉండలేనపుడే రాయి
– మందరపు హైమావతి