Totemistic జాతులు, భూతవాదులైన (Ani mists) పూర్వీకులు(ancestors) మరణించినవారి శరీరాలకు రాకాసిగుళ్ళు (Megalithic Tombs) నిర్మించారు. ఈ పెదరాతియుగం సమాధుల ప్రభావం చేతనే బుద్ధుని ధాతువులపై స్తూపాలను నిర్మించడం మొదలైంది. బౌద్ధంలో తొలుత నిర్మించబడ్డవి స్తూపాలే. ఇవి స్మారకచిహ్నాలు. స్తూపాలు స్థూలంగా మూడు రకాలు. 1.ఉద్దేశిక స్తూపం, 2.పారభోజిక స్తూపం, 3.శారీరక స్తూపం.
ఉద్దేశిక స్తూపాలు బుద్ధునికి ప్రతిరూపంగా భావిం చి ఆరాధించే నిర్మాణం. అర్ధగోళాకారంగా చెక్కబడిన రాళ్ళు, ఇటికెలతో చేసినవి, మట్టితో చేసినవి పూజార్హమైనవే. పారభోజిక స్తూపాలలో బౌద్ధగురువుల దుస్తులు, వస్తువులను దాచి, వారికి ప్రతిరూ పం, ప్రాతినిధ్యంగా ఆరాధించేవారు బౌద్ధులు. శారీరక స్తూపాలంటే బుద్ధుని శరీర ధాతువులను నిక్షిప్తం చేసిన కరండాలతో కూడినవి, బుద్ధుని శిష్య, ప్రశిష్యులలో ముఖ్యులైన వారి శరీర ధాతువులుంచిన అర్ధగోళాకార నిర్మాణాలు. వాటికి అలంకరణ ఫలకాలు, ప్రదక్షిణాపథాలు, ఆయక స్తంభాలు, తోరణ ద్వారాలు, దానశాసనాల రాతిపలకలు ఉంటాయి.
ప్రతిబౌద్ధ స్తూప నిర్మాణంలో ఒక చక్రాకృతి వేదిక (Drum) దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome), అండముపై ఒక హర్మిక (Pavilion), దానిలో సార్వభౌమాధికార సూచికగా దండసహిత ఛత్రము (Umbrella), అండము, హర్మికల మధ్య గళము (neck), వేదికకు నలువైపుల ఆయక వేదికలు, వాటిపై ఐదేసి ఆయక స్తంభాలు, స్తూపం చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings), ప్రాకారాల మీద బుద్ధుని జీవిత విశేషాలు, బౌద్ధ జాతక కథల సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి. ప్రదక్షిణాపథం, ఆయక స్తంభాలు, శిల్పాలు, శిల్పాలతో తోరణ ద్వారాలు, వాటిని అనుసరించి నిర్మించిన ఆరామా లు, చైత్యాలుంటాయి. తొలుత బుద్ధ విగ్రహాలు లేవు. బౌద్ధ జాతక కథలను దృశ్యమానం చేసిన శిల్ప ఫలకాలు, బుద్ధుని జీవిత సంఘటనల్ని శిల్పించిన పానెల్స్ బౌద్ధస్తూపాల ప్రాకారాలను అలంకరించాయి. తోరణాల మీద చెక్కబడ్డాయి.
చైత్యగృహాలు: బౌద్ధుల ఆరాధనస్థలాలు చైత్యగృహాలు. ఇవి కొండల్లో తొలిచినవి, ఇటికెలతో కట్టినవని రెండు రకాలు. చైత్యంలో ద్వారప్రవోష్టం, దేహాళి, చైత్యాలయం అని మూడు భాగాలు. చైత్య వాతాయతనం గుర్రపునాడా ఆకారంలో ఉంటుం ది. థేరవాద చైత్యాలు నిరాడంబరాలు. మహాయానులు స్తూపముఖంలో బుద్ధుని ప్రతిమను రచించేవారు. ఇందుకు అజంతా గొప్ప ఉదాహరణ. బౌద్ధంలో వచ్చిన మహాయాన, వజ్రయాన పరిణామాలు ఈ శిల్పాలకు కారణభూతాలు. మహాయానంలో బుద్ధుడు లోకోత్తరుడైనాడు. బోధిసత్త్వులు వచ్చారు. జాతక కథలు రచించబడ్డాయి. వీటితో బౌద్ధం ఆకర్షణీయమతంగా పరిణమించింది. బుద్ధుని శిల్పాలలో 1.ధ్యానాసన బుద్ధుడు, 2.స్థానక బుద్ధుడు అని రెండు రకాలు. మళ్ళీ వీటిలో అనేక భేదాలుంటాయి.
ధ్యానాసనబుద్ధుడు
ధ్యానాసనబుద్ధుడు సకలముకుళం లేదా అర్ధపద్మాసనంలో ఎడమమోకాలి మీద మూసిన పిడికిలిని వుంచి కూర్చుని వుంటాడు. ఒంటిమీద చీవరం లేదా సంఘాతి పొరలు ఎడమభుజం, చేయి, వీపును కప్పివుంటాయి. ఛాతీమీద చీవరం ఎడమభుజం నుంచి కిందివరకు అడ్డంగా సన్నగా కనిపిస్తుంది. కుడిచేయి అభయముద్ర పట్టివుంటుంది. అతని పాదాలు, అరచేతిలో అష్టమంగళ చిహ్నాలు అగుపిస్తాయి. బుద్ధశిల్పం తలమీద తలవెంట్రుకలను బిగించి, చుట్టిన సిగముడి ‘ఉష్ణీషం’, మంగళదాయకమైన నుదుటి మీద రాతిస్ఫటిక చిహ్నం ‘ఊర్ణ’(బొట్టువంటి) ఉంటాయి. గతం లో ధరించిన బరువైన కుండలాల వల్ల సాగిన చెవుల తమ్మెలు…ఇవి ఆసనబుద్ధుని ప్రతిమాలక్షణం.
స్థానకబుద్ధుడు
స్థానక బుద్ధుడు సమపాదభంగిమలో నిలబడిన శిల్పరూపం. తల, కుడిభుజం వదిలి శరీరమంత కప్పిన సంఘాతి ఉంటుంది. తలపై ఉష్ణీషం, కుడిచేయి అభయముద్ర తో, ఎడమచేయి ఎడమభుజందాక ఎత్తిపట్టుకున్నట్టు కనిపిస్తాడు బుద్ధు డు. (నాగార్జున కొండపైన గాంధారశైలి బుద్ధుని స్థానకశిల్పం)
తెలంగాణాలో బావనూర్ కుర్రు, కోటిలింగాల, పాశిగాం, ధూళికట్ట, నేలకొండపల్లి, నాగార్జున కొండ, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపాలనగరం, కంభాలపల్లి, సింగరాయలొద్ది, ఏలేశ్వరం, చాడలలో బౌద్ధస్తూపాలు, కొండాపూర్, లింగాలమెట్ట, పెదబంకూర్, మాహూర్, తేలుకుంట, వర్ధమానుకోట, తిర్మలగిరి, కారుకొండ, దేవునిగుట్ట, కొలనుపాక, బాసర, చైతన్యపురి, కీసరగుట్ట, ఇప్పగూ డెం, గీసుకొండ, పజ్జూరు, ఎల్ మడుగు, మునులగుట్ట, కొన్నె గజగిరిగుట్ట, రాయగిరి, రఘునాథపు రం, ముదిగొండ, వేములకొండ, పరడ, నాగారం, రామిరెడ్డిపల్లి, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డగూడెం, గొట్టిపర్తి, ఆమనగల్లులలో బౌద్ధశిల్పాలు, బౌద్ధనిర్మాణాల జాడలున్నాయి.
బుద్ధుని శిల్పాలు ఫణిగిరి, నేలకొండపల్లి, కారుకొండ, నాగులవంచ, వర్ధమానుకోట, చాడలలో తవ్వకాలలో లభించాయి. సూక్ష్మమైన బోధిసత్వుని శిల్పం గీసుకొండలో, అతిపెద్దదైన స్టక్కో బోధిసత్వుని శిల్పం ఫణిగిరిలో లభించాయి. శాసనంతో పాటు నాగముచుళింద ఫలకాలు ధూళికట్ట, పరడలలో ల భించాయి. దేశంలోనే తొలి హారీతి కంచుశిల్పం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాలలో వెలుగుచూసింది. కొండాపూర్లో టెర్రకోట హారీతీ శిల్పం, కొలనుపాక సమీపగ్రామం రాఘవాపురంలో మూడడుగుల ఎత్తున్న హారీతీ శిలాశిల్పం గుర్తించబడ్డాయి. బౌద్ధస్తూపాలు, ఆరామాల వద్ద లభించిన ప్రాకృతభాష, బ్రాహ్మీలిపి శాసనాలు బౌద్ధధర్మానికి, దే శంలో లిపిపరిణామాలకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. మొత్తం దే శంలో బౌద్ధధర్మశిల్పాలు ఎన్ని వైవిధ్య శైలులలో చెక్కబడ్డాయో వాటికి ప్రతినిధులైన శిల్పాలు తెలంగాణ బౌద్ధధర్మక్షేత్రాలలో లభించాయి.
– శ్రీరామోజు హరగోపాల్