నవంబర్ 1లోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి..
లేకపోతే 3 నిరవధిక బంద్ చేపడతాం
హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్
3 లక్షల మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహిస్తాం
ఫతి చైర్మన్ రమేష్ వెల్లడి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు నవంబర్ 3 నుంచి బంద్ చేపట్టాలని ప్రైవేట్ యాజమాన్యాలు నిర్ణయించాయి. హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్‌తో పాటు 3 లక్షల మంది విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రతినిధులతో కలిసి చైర్మన్ రమేష్ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ రమేష్ మీడియాతో మాట్లాడూతూ, నవంబర్ 1వ తేదీలోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని వెల్లడించారు.
ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ చేపడతామని, ఈ లాంగ్‌మార్చ్‌లో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. 3 లక్షల మంది ఉద్యోగులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే కాలేజీల్లో తనిఖీలు గుర్తుకు వస్తున్నాయని మండిపడ్డారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని అన్నారు. ఒక్క పోలీసును కూడా కాలేజీల్లోకి రానివ్వం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు దసరాకి రూ.600 కోట్లు ఇస్తామని చెప్పి స్వల్పంగా నిధులు విడుదల చేశారని, దీపావళి నాటికి రూ.1200 కోట్ల బకాయిలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ వాటి గురించి ఎలాంటి కదలిక లేదని అన్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం తాము ఇప్పటికే మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో బంద్ పాటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంత్రులు తమకు సహకరించడం లేదని అన్నారు.ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుంటే తాము కాలేజీలు నడపలేమని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని.. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్లను అభ్యసిస్తున్న 15 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఎక్కువ మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆధారపడి ఉన్నారని అన్నారు. వారంతా సొంతంగా ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు కృష్ణారావు, సునీల్‌కుమార్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.