మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి కన్నకూ తురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెండో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అయితే చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో నిజం బయటపడింది. కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి బాలికపై అఘాయిత్యం జరిగిందని నిర్ధరించారు. దీంతో కంగుతిన్న బాలిక తల్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
తండ్రికి కఠిన శిక్ష విధించాలి
గ్రామంలోని ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ తండ్రికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మళ్లీ ‘మన సమాజం ఎటు పోతుందో?‘ అనే ప్రశ్నను తలెత్తిస్తోంది. పాప కుటుంబానికి మద్దతుగా మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ పాపకు వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్ అందించేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలని సూచిస్తున్నారు. పాఠశాలలు, గ్రామ స్థాయి స్థాయిలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమాలు అత్యవసరమని కోరుతున్నారు. ఈ ఘటన మరోసారి మన సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. రక్షణనివ్వాల్సిన తండ్రే దాడి చేసేవాడిగా మారితే, పిల్లల భవిష్యత్తు ఎలా సురక్షితం అవుతుంది? చట్టం తన పని చేస్తుందేమో కానీ, ఇలాంటి మృగాలకు శిక్షతో పాటు సామాజిక అవమానమే పెద్ద పాఠమని ప్రజలు అంటున్నారు.